ఈ సామాన్యుడు మ‌హా 'క‌సి' గాడు!

Update: 2019-06-29 04:40 GMT
ఆణిముత్యాలు బంగారు షాపుల్లోనూ.. ఆభ‌ర‌ణాల షోరూమ్ లో ఉంటాయ‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. మ‌ట్టిలో ఉండే ఇలాంటి ఆణిముత్యాల్ని కాస్తంత షేప్ చేస్తే చాలు దేశ ప్ర‌తిష్ఠ‌ను మ‌రింత పెంచేస్తారు. ఒలంపిక్స్ లో దేశ ప‌త‌కాన్ని స‌గ‌ర్వంగా ఎగుర‌వేయాల‌న్న ధృడ సంక‌ల్పం ప్ర‌కాశం జిల్లాకు చెందిన క‌సిన‌బోయిన మ‌హేశ్ సొంతం.

ఇత‌గాడు తాజాగా చేసిన ఫీట్ తెలిస్తే అవాక్కు అవుతారు. ఇత‌గాడి ద‌మ్ముకు ప్ర‌భుత్వ ప్రోత్సాహం తోడైతే.. కొత్త రికార్డుల్ని సృష్టించ‌ట‌మే కాదు.. తెలుగోళ్ల ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి చాట‌టం ఖాయం. మంచి అథ్లెట్ అయిన మ‌హేశ్ తాజాగా 9.48 గంట‌ల్లో ఏకంగా 100 కిలోమీట‌ర్లు నాన్ స్టాప్ గా ప‌రిగెత్తి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నారు.  జ‌న‌స‌మ్మ‌ర్థం ఉన్న రోడ్ల మీద‌న ప‌రిగెత్తితేనే ఇలా ఉంటే.. కాస్తంత శిక్ష‌ణ ఇచ్చి ట్రాక్ మీద‌కు వ‌దిలితే దున్నేసే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆంధ్రప్ర‌దేశ్ లోని ప్ర‌కాశం జిల్లా బేస్త‌వార‌పేట మండ‌లంలోని పాపాయిప‌ల్లికి చెందిన కుర్రాడు మ‌హేశ్‌.
 
ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌.. హైద‌రాబాద్‌.. ముంబ‌యి.. విశాఖ‌..బెంగ‌ళూరు త‌దిత‌ర న‌గ‌రాల్లో జ‌రిగిన మార‌థాన్ పోటీల్లో పాల్గొన్న ఇత‌గాడు.. ముంబ‌యి మార‌థాన్ లో 42 కి.మీ. దూరాన్ని 2.11 గంట‌ల్లో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్ కు అర్హ‌త సాధించ‌ట‌మే త‌న ల‌క్ష్యంగా చెబుతున్నారు.

తాజాగా త‌న స్నేహితులు టూ వీల‌ర్ మీద వెంట రాగా.. గురువారం రాత్రి 11.30 గంట‌ల‌కు బేస్త‌వార‌పేట బ‌స్టాండ్ నుంచి ప‌రుగు షురూ చేసి తాటిచ‌ర్ల మోటు.. కొమ‌రోలు.. ఎడ‌మ‌క‌ల్లు.. గిద్ద‌లూరు.. తురిమెళ్ల‌.. కంభం మీదుగా శుక్ర‌వారం ఉద‌యం 9.18 గంట‌ల స‌మ‌యానికి బేస్త‌వార‌పేట‌కు చేరుకున్నారు. 9.48 గంట‌ల వ్య‌వ‌ధిలో 100 కి.మీ. నాన్ స్టాప్ గా ప‌రిగెడుతున్న మ‌హేశ్ ఇంటిపేరుకు త‌గ్గ‌ట్టే.. ల‌క్ష్యాన్ని ఛేదించాల‌న్న క‌సి కాస్త ఎక్కువ‌నే చెప్పాలి. అత్యుత్త‌మ ల‌క్ష్యం దిశ‌గా ప‌రిగెడుతున్న మ‌హేశ్ కు ఆల్ ద బెస్ట్ చెబుదాం.  


Tags:    

Similar News