తెలంగాణలో ‘పది’ పరీక్షకు అది ఉండాలంట

Update: 2015-11-29 04:25 GMT
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష రాయటం అంత ఈజీ కాదు. గతంలో మాదిరి టెన్త్ పరీక్ష రాయటానికి వీల్లేదని తాజాగా తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. టెన్త్ పరీక్ష రాసే ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు తప్పనిసరి అని తేల్చింది. పదో తరగతి పరీక్ష కు ఆధార్ ఉండాలని.. అందులోని నెంబర్ ను నమోదు చేస్తే తప్పించి పదో తరగతి పరీక్షకు అనుమతించలేమంటూ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది.

తాజా నిర్ణయంతో అధికారులు.. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు కంగుతింటున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా.. ఇప్పటికిప్పుడు ఆధార్ ఇవ్వాలంటే కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి నిర్ణయం కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని స్కూళ్ల యాజమాన్యాలు వాపోతున్నారు. అయితే.. వారి వాదనను తెలంగాణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవటం లేదు.

విద్యార్థుల ఆధార్ వివరాల్ని డిసెంబరు 15 నాటికి ఇచ్చేయాలంటూ గడువు విధించటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.  విద్యార్థుల నామినల్ రోల్స్ ను పంపటానికి డిసెంబరు 1వ తేదీని తుది గడువుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ.. ప్రైవేటు.. ఎయిడెడ్ స్కూళ్లల్లో చదివే అన్ని తరగతుల విద్యార్థులకు ఆధార్ సంఖ్య  ఇచ్చేందుకు డిసెంబరు 15 గడువుగా విధించారు.  విద్యార్థులు ఆధార్ ను జత చేయటానికి తాము వ్యతిరేకం కానప్పటికీ.. ఇంత స్వల్ప వ్యవధిని ఇవ్వటం సరికాదన్న మాట వినిపిస్తోంది.  టెన్త్ పరీక్షలకు ఆధార్ తప్పనిసరి అన్న ప్రచారం జోరుగా చేసిన తర్వాత.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఆధార్ మీద తెలంగాణ సర్కారు తన నిర్ణయాన్ని తాత్కలికంగా వెనక్కి తీసుకుంటే విద్యార్థులకు ఉపశమనంగా మారుతుందని చెబుతున్నారు. మరి.. తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News