మద్యం కొనాలంటే..అక్కడ ఆధార్ తప్పనిసరి?

Update: 2019-09-06 05:40 GMT
ఇప్పుడు ‘ఆధార్‌’ అన్నింటికీ ఆధారంగా మారుతోంది. ప్రభుత్వ పథకాల దగ్గరి నుంచి ఆయా అవసరాల కోసం గుర్తింపు కార్డుగా చాలా మంది ఆధార్‌ కార్డునే పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాగా ఇప్పుడు మద్యం కొనుగోలు చేయాలన్నా ఆధార్‌ తప్పనిసరి చేసేటట్లు తెలిసింది. మద్యం ప్రియులకు షాక్‌ ఇస్తూ కొద్ది రోజుల్లో మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. మద్యం బాటిళ్లు - టెట్రాప్యాకుల ద్వారా పరిసరాలు కలుషితం అవుతున్నట్లు ఇటీవల చాలా ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. 
 
మద్యం తాగిన తర్వాత ఆ బాటిళ్లను ఎక్కడపడితే అక్కడ విసిరిపారేస్తూ సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు - మైదానాలు - ఉద్యానవనాల్లో ఖాళీ బాటిళ్లను పడేస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఇటీవల కాలంలో నదులు - చెరువుల్లోనూ ఖాళీ మద్యం బాటిళ్లు - టెట్రాప్యాకెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మద్యం బాటిళ్లు - ప్యాకెట్లు ఎక్కడబడితే అక్కడ కనిపించడంపై మంగళూరుకు చెందిన పరిసర సంరక్షణ సంఘం సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇకపై మద్యం కొనుగోలు చేసేవారికి ఆధార్‌ కార్డు చూపించడం తప్పనిసరి చేస్తే కొంతమేర సత్ఫలితాలు కనిపించే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది.

సంఘం సిఫారసు చేసిన సూచనలతో పాటు పూర్తి నివేదికను ఆధారంగా చేసుకుని త్వరలో మద్యం కొనుగోలుపై ఆధార్‌ కార్డును తప్పనిసరి చేద్దామని అబ్కారీ శాఖ కమిషనర్‌ కు ఆ శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఆ లేఖపై స్పందించిన కమిషనర్‌.. ఒక్కోట సంఘం ఇచ్చిన సలహాలపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ప్రజాభిప్రాయం ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. కాగా, ఒక్కోట సంఘం చేసిన కొన్ని సిఫారసులు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని పలువురు అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. సంఘం చేసిన సిఫారసులు మద్యం ప్రియులకు అనుకూలంగా ఉన్నాయని అధికారులు వాపోతున్నారు.

– మద్యం దుకాణాదారుడు కొనుగోలు దారుడి ఆధార్‌ నంబర్‌ ను కంప్యూటర్‌ లో నిక్షిప్తం చేసి మద్యం విక్రయించాలి.

– ఒక్కసారి కొనుగోలు చేసిన వ్యక్తి మరోసారి దుకాణానికి వస్తే మొదట కొన్న మద్యం బాటిల్‌ ను తిరిగి అప్పగిస్తేనే కొత్త మద్యం బాటిల్‌ ను విక్రయించాలి.

– ఎక్కడైనా ఖాళీ మద్యం బాటిల్‌ పడేసినట్లు కనిపిస్తే - దానిపై ఉన్న బార్‌ కోడ్‌ స్కాన్‌ చేసి దాన్ని అమ్మిన మద్యం దుకాణానికి జరిమానా విధించాలి. అలాగే లైసెన్సు రద్దు చేయాలి.

– మద్యం మత్తులో తాగిన వారు ఎక్కడబడితే అక్కడ పడకుండా వారిని అబ్కారీ శాఖ వాహనంలో సురక్షితంగా ఇంటికి చేర్చాలి.

– తాగడానికే మొత్తం డబ్బులను ఖర్చు చేస్తే - మద్యం ప్రియుల ఇంటికి కావాల్సిన దైనందిన సామగ్రిని అబ్కారీ శాఖనే ఉచితంగా ఇవ్వాలి.

– రోజూ తాగడం వల్ల ఆరోగ్యం పాడయితే - మద్యం ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు - చికిత్స చేయించాలి. ఆ భారాన్ని మొత్తం అబ్కారీ శాఖనే భరించాలి.
Tags:    

Similar News