ఆధార్‌ ఉంటేనే ఆవులకు మేత

Update: 2016-01-25 07:04 GMT
దేశంలో ప్రతి అవసరానికీ ఆధార్ అవసరమైపోయింది. ఆధార్ కార్డులు వచ్చిన తొలినాళ్లలో ఉల్లిపాయలు కొనడానిక్కూడా ఆధార్ అడుగుతారేమో అని సరదాగా అనేవారు. కొద్దినెలల కిందట ఉల్లి ధరలు పెరిగిపోతే రైతు బజార్లలో ఆధార్ కార్డు చూపించినవారికి తక్కువ ధరకు ఉల్లి ఇచ్చి ఆ సరదా మాటలను నిజం చేశారు. ఇప్పుడు ఆధార్ కు పాడి పశువులకు మేతకు లింకు పెట్టారు. మేత కావాలంటే వాటి యజమానులు ఆధార్‌ కార్డు కలిగి ఉండాలని ప్రభుత్వం తాజాగా నిబంధన విధించింది. కరువు ప్రాంతాల్లో పశుగ్రాసానికి కొరత ఏర్పడ్డప్పుడు రైతులకు సబ్సిడీపై మేత సర్కారు సరఫరా చేస్తోంది. ఇక నుంచి రాయితీపై ప్రభుత్వం పంపిణీ చేసే గ్రాసాన్ని పొందడానికి లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్‌ కలిగి ఉండాలి. ఆధార్‌ లేని వారికి గ్రాసం సరఫరా చేయరు. దీనిపై జీవో కూడా వచ్చేసింది.

ప్రపంచ బ్యాంకు రుణంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పశుగ్రాస భద్రతా విధానాన్ని ప్రకటించింది. 2015-20 వరకు ఐదేళ్ల పాటు ఇది అమలవుతుంది. ఈ ప్రత్యేక పథకానికి రూ.250 కోట్లు ఖర్చు చేస్తుండగా అందులో వంద కోట్లను ప్రపంచ బ్యాంక్‌ నుంచి సేకరించిన రుణం నుంచి సర్కారు సమకూరుస్తోంది. మిగతా రూ.150 కోట్లకు మహాత్మాగాంధీ ఉపాధి హామీ నిధులు వినియోగిస్తోంది.

ఇదంతా ఎలా ఉన్నా కరవు కారణంగా పశువులను ఎలా సాకాలో అర్థం కాక దిగులు పడుతున్న రైతులకు పశుగ్రాసం అందజేయాల్సింది పోయి, దానికీ ఆధార్‌ కావాలన్న నిబంధన విధించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పలు పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. ఒక పక్క సుప్రీం కోర్టు సర్కారీ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి కాకూడదని, ఆ పేరుతో లబ్ధిదారులకు ప్రయోజనాలు నిరాకరించొద్దని ఆదేశించినా సర్కారు మాత్రం అన్నిటికీ ఆధార్ అంటోంది. చివరకు మూగజీవుల మేతకూ ఆధారే దిక్కవుతోంది. ఫ్యూచర్లో వాటికే డైరెక్టుగా ఆధార్ కార్డు ఇష్యూ చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News