సెంటిమెంట్: సిక్కోలు నుంచే ఆప్ శ్రీకారం...?

Update: 2022-05-12 15:30 GMT
షార్ట్ కట్ లో ఆప్. అసలు పేరు ఆమ్ ఆద్మీ. ఈ పార్టీ ఢిల్లీలో  ఎనిమిదేళ్ళ నాడు రాజకీయంగా పొలికేక పెట్టిన తరువాత దేశమంతా ఒక్కసారిగా  ఆ వైపు చూసింది. ఇక పంజాబ్ లో ఆ మధ్యన  జాతీయ పార్టీలను వెనక్కి నెట్టి పవర్  దక్కించుకున్నాక ఆప్ దేశాన గాలి మాములుగా లేదని అనుకున్నారు. ఇపుడు చూస్తే  నార్త్ స్టేట్స్ లో ఆప్ పేరు నానుతోంది. మరి సౌత్ స్టేట్స్ మీద కూడా  ఆప్ దృష్టి పెట్టింది.

దాంతో ఆప్ తొలి అడుగులు తెలుగు సీమతోనే అంటున్నారు. ఏపీలో చూస్తే వచ్చే ఎన్నికల్లో ఆప్ పోటీ చేయాలని గట్టిగా డిసైడ్ అయింది. మరి పొత్తులతో వస్తారా సొంతంగా బరిలోకి దిగుతారా అన్నది పక్కన పెడితే ముందుగా తమ సత్తా ఎంతో తేల్చుకునేందుకు ఆప్  ఏపీలో ఒక రౌండ్ టూర్ గట్టిగానే  వేయాలని అనుకుంటోంది.

ఈ నేపధ్యంలో ఆప్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మణినాయుడు డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి ఏపీలోని శ్రీకాకుళానికే వస్తున్నారు. ఆయన శ్రీకాకుళం నుంచే రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకునే కార్యక్రమాలను శ్రీకారం చుడతారు అంటున్నారు.

ఇక ఈ నెల 14న ఆప్ నాయకుడు మణి నాయుడు రాక సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఆ తరువాత స్థానిక నాయకులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. 2024లో ఏపీలో జరిగే ఎన్నికలకు ఆప్ ని రెడీ చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు.  అలాగే ఆప్ లో చేరే వారిని కూడా గుర్తించి పార్టీలోని ఆహ్వానం పలుకుతారు అని అంటున్నారు. మొత్తానికి ఆప్ ఉత్తరాంధ్రా నుంచే తన రాజకీయ సమరాన్ని మొదలుపెడుతోంది అన్న మాట.

మరో వైపు చూస్తే ఆప్ అధినాయకుడు అరవింద్ కేజ్రీ వాల్ కి టీడీపీ అధినాయకుడు చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. 2019 ఎన్నికలో చంద్రబాబు విజయానికి విశాఖలో ఆయన ప్రచారం చేశారు. దాంతో రానున్న రోజుల్లో ఆప్ టీడీపీ కూటమితో కలసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఆప్ ఏపీ  ఇంచార్జి  మణినాయుడు టూర్లో ఎంతో కొంత రాజకీయ స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News