ముదిరిపోతున్న 'ఆప్' వివాదం

Update: 2022-09-01 06:53 GMT
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ సర్కార్ కు మధ్య వివాదం బాగా ముదిరిపోతోంది. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కొందరు ఆప్ ఎంఎల్ఏలపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) పరువు నష్టం దావా వేయబోతున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్నిరకాలుగానే కేంద్రప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. ఇందుకు ఎల్జీని తమ ఆయుధంగా వాడుకుంటున్నారు మోడీ. ఢిల్లీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎల్జీ అడ్డుకుంటున్నారు.

ప్రత్యక్షంగా అందరికీ కనిపిస్తున్నది కేజ్రీవాల్-ఎల్జీనే అయినా పరోక్షంగా కేజ్రీవాల్ యుద్ధం చేస్తున్నది మాత్రం నరేంద్రమోడీతోనే అని అందరికీ తెలుసు. ఈ మధ్య ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో ఆప్ ఎంఎల్ఏలు ఆతిష్, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్ అండ్ కో మాట్లాడుతూ ఎల్జీ వీకే సక్సేనాపై ఆరోపణలు చేశారు.

నోట్లరద్దు జరిగినపుడు సక్సేనా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ కమిషన్ ఛైర్మన్ గా ఉండేవారట. తన ఉద్యోగులపై సక్సేనా ఒత్తిడి తెచ్చి రు. 1400 కోట్ల విలువైన పాత నోట్లను కొత్తనోట్లుగా మార్చుకున్నారని ఆప్ ఎంఎల్ఏలు ఆరోపించారు.

ఇదే విషయమై ఎల్జీ స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆప్ ఎంఎల్ఏలపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు చెప్పారు. నోట్ల రద్దు సమయంలో ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ ఖాతాలో రద్దయిన నోట్లు జమయిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. తమ విచారణలో పాత నోట్లు జమయిన విషయం వాస్తవమే అని తేలిందన్నారు. ఇందుకు నలుగురు ఉద్యోగులు కారణమని గుర్తించినట్లు, జమయిన మొత్తం రు. 17 లక్షలుగా లెక్క తేల్చినట్లు కూడా సక్సేనా చెప్పారు.

రు. 17 లక్షల పాత నోట్లు జమయితే దాన్ని ఆప్ ఎంఎల్ఏలు రు. 1400 కోట్లుగా మార్చి ఆరోపణలు చేయటం తన పరువుకు భంగం కలిగించటమే అన్నారు. కాబట్టి ఎంఎల్ఏలపై వెంటనే పరువు నష్టం దావా వేయబోతున్నట్లు చెప్పారు. ఏదో విషయంలో ఆప్ ప్రభుత్వానికి ఎల్జీకి మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News