సామాన్య సర్కారుకు మరీ ఇంత ప్రచార యావా?

Update: 2016-09-19 07:51 GMT
నీతులు చెప్పటం ఎంత ఈజీనో.. వాటిని ఆచరించి చూపించటం అంత కష్టం. ఆ విషయం ఢిల్లీ రాష్ట్రాన్ని ఏలుతున్న ఆమ్ ఆద్మీ సర్కారును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పెద్దపెద్ద పుస్తకాల్లో కనిపించే సిద్ధాంతాల్ని తాము ప్రాక్టికల్ గా చేసి చూపిస్తామని.. దేశ రాజకీయాల్లో సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తామని చెప్పే సదరు పార్టీ తీరును ఇప్పటికే పలువురు తప్పు పడుతున్నారు.

దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నా.. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై రానన్ని ఆరోపణలు.. కేసులు.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారిపై నమోదు కావటం గమనార్హం. అంతేకాదు.. ప్రస్తుతం జైల్లో ఉంటున్న ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువేం కాదు. ఇదిలా ఉంటే.. ఈ పార్టీకి ఉన్నంత ప్రచార యావ మరే పార్టీకి ఉండదన్న విషయం తాజాగా రుజువైందని చెబుతున్నారు. ఢిల్లీ అధికారపక్షంగా తాము చేసిన పనుల గురించి ప్రచారం చేసుకునేందుకు వందల కోట్ల రూపాయిల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ ఖర్చుపై కేంద్రం నియమించిన ఒక కమిటీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయటం గమనార్హం. అధికారంలో ఉన్న రాష్ట్ర సర్కారు.. తమ ప్రభుత్వం చేసే మంచిపనుల గురించి ప్రచారం చేసుకోవటం తప్పేం కాదు. కానీ.. కేజ్రీవాల్ సర్కారు విషయంలో ఇది శ్రుతిమించినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. తమ సర్కారు చేసిన పనుల గురించి ప్రచారం చేసుకునేందుకు ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లో చేసిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల రూ.287 కోట్లుగా చెబుతున్నారు. ఇదంతా డిస్కౌంట్ చేసిన తర్వాత అవుతున్న ఖర్చు అని.. అదే ఎలాంటి డిస్కౌంట్ లేకుండా అయితే.. ఈ ఖర్చు రూ.854 కోట్ల వరకూ ఉండేదని చెబుతున్నారు.

కేవలం ప్రచారం కోసం.. తమ పార్టీ ఒకటి ఉందని కూడా సరిగా తెలియని రాష్ట్రాల్లో పెట్టిన ఖర్చు వందల కోట్లు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రజాధనాన్ని వృధా చేసిన తీరుపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఎవరిని అడిగి ఇంత భారీగా ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తున్న ఆ పార్టీ ఆ మొత్తాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేస్తుంది.
Tags:    

Similar News