ఏబీ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ : రాష్ట్రాన్ని తగులబెట్టాలని చూస్తే ఆపారా...?

Update: 2022-06-29 14:30 GMT
ఏపీలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా మూడేళ్ళుగా కధ సాగుతోంది. ఈయన చంద్రబాబు జమానాలో ఒక వెలుగు వెలిగారు. ఇంటలిజెన్స్ బ్యూరోకు ముఖ్య  అధిపతిగా కీలకమైన పాత్ర పోషించారు. నాడు వైసీపీకి టీడీపీకి మధ్య ఉప్పు నిప్పూ అన్నట్లుగా రాజకీయం సాగుతున్న టైమ్ లో ఏబీ చాలా క్రియాశీలంగా వ్యవహరించారు అన్న దాన్ని గుర్తు పెట్టుకునే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు అని అంటారు.

ఇక గతంలో ఏబీ మీద సస్పెన్షన్ వేటు పడితే ఆయన సుప్రీం కోర్టు దాకా పోరాడి వచ్చారు. ఈ మధ్యనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం చూసేందుకు కమిషనర్ గా పదవి ఇచ్చారు. అయితే ఈ పదవి కూడా మూణ్ణాళ్ళ ముచ్చట అయింది. ఆయన్ని మరోసారి సస్పెండ్ చేశారు. దీంతో మీడియా సమావేశం పెట్టి మరీ ఏబీ చాలా విషయాలు చెప్పారు. తాను ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉండే అధికారిని అని చెప్పుకున్నారు.

మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ రాష్ట్రాన్ని తగలబెడదామని చూసిన వారి నుంచి ఏపీ స్టేట్ ని గతకాలాన రక్షించాను అని చెప్పారు. తాను ఐబీ చీఫ్ గా ఉన్నపుడు కోడి కత్తి సంఘటన జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆ తరువాత రాష్ట్రంలో అలజడులు ఏవీ చెలరేగకుండా సమర్ధంగా  అడ్డుకున్నాను అని ఆయన చెప్పారు. తాను వ్యవసాయాన్ని పోలీస్ వృత్తిలో ఉంటూ చేస్తున్నానని, సమాజం నుంచి చీడ పురుగులను ఏరివేయడమే తన వ్యవసాయం అని ఏబీ చెప్పడం విశెషం.

ఇవన్నీ సరే కానీ రాష్ట్రం తగులబెట్టేందుకు చూసిందెవరు, వారు అనాడు వేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటి, ఆ స్కెచ్ ని ఎలా ఏబీ పసిగట్టి బ్రేక్ వేశారు. ఏపీని ఏ విధంగా ఏబీ కాపాడారు అన్నది మాత్రం చెప్పలేదు. అసలు ఏ పార్టీ వారు ఆ పని చేశారు అని కూడా ఆయన ఎక్కడా సూటిగా చెప్పలేదు. మొత్తానికి ఆనాడు  వైసీపీ వారిని కట్టడి చేశాను అని అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడారు. అంటే నాడు తాను సమర్ధంగా తన జాబ్ ని నిర్వహిస్తే ఇపుడు ప్రతిఫలంగా ఇలా చేస్తున్నారు అని ఆయన వాపోయారు.

ఈ సందర్భంగా భాగవతంలోని ఒక పద్యాన్ని కూడా ఏబీ కోట్ చేస్తూ పాడి వినిపించడం జరిగింది. హాలికులు అయిననేమి అని పోతన రాశారని, దుర్మార్గులైన రాజుల కొలువు కంటే వ్యవసాయం చేసుకోవడం ఉత్తమమని పోతన రాసిన పద్యం భావన అని ఏబీ సెటైర్లు వేశారు. మరి ఆ దుర్మార్గమైన రాజులు ఎవరు అన్నది ఆయన చెప్పకపోయినా సెటైర్లు వేసిన తీరు బట్టే జనాలకు ఎవరో అర్ధమవుతోందని చెబుతున్నారు.

ఇక తాను న్యాయపరంగానే అన్నీ తేల్చుకుంటాను అంటున్న ఏపీ వైసీపీలో ఈ మధ్య పెద్ద ఎత్తున సాగుతున్న వర్గ పోరుని  కూడా ఇండైరెక్ట్ గా చెప్పడమూ విశేషమే. ఒకనాడు తమ ప్రభుత్వం వస్తోంది అని చెప్పి నీ సంగతి చూస్తామని చెప్పిన ఒకానొక ప్రజాప్రతినిధి ఇపుడు తనను కొందరు టార్గెట్ చేస్తున్నారు అని మీడియా ముందు ఘొల్లుమనడం చూస్తే ఎవరిని ఎవరు ఏం చేశారు అన్నది అర్ధమవుతుంది అని ఏబీ గట్టి కౌంటరే ఇచ్చారు. ఇండైరెక్ట్ గా నెల్లూరుకు చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలోనే ఏబీ ఈ కామెంట్స్ చేసినట్లుగా ఉంది.

ఇక ప్రస్తుత ప్రభుత్వంలో కొందరు అధికారులు కేసులు ఉన్నా పని చేస్తున్నారు అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి విషయాన్ని అన్యాపదేశంగా ఆయన ప్రస్థావించారు. ఎవరి మీద కేసులు లేవు అంటూ ఆయన వైసీపీ ఏలికలనే ఇండైరెక్ట్ గా గురి చూసి కామెంట్స్ చేశారు. మొత్తానికి ఏబీ తాను తగ్గేదే లే అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మరి ఏబీ కోర్టుకు వెళ్తే సర్కార్ కి చిక్కులు తప్పవా అన్న చర్చ కూడా సాగుతోంది.
Tags:    

Similar News