నో పోస్టింగ్ : ఏబీవీ విషయంలో ఎందాకైనా...?

Update: 2022-05-11 10:33 GMT
ఆయన గత టీడీపీ సర్కార్ ఏలుబడి లో ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఆయన మీద అనేక రకాలైన ఆరోపణలు నాడు విపక్షంలో ఉన్నపుడు వైసీపీ చేసింది. ఇక అధికారం లోకి వస్తూనే ఆయన మీద డైరెక్ట్  యాక్షన్ కి దిగిపోయింది. ఆయన మీద కేసులు పెట్టింది.  చివరికి సస్పెన్షన్ కూడా చేసింది. అయితే సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఏ అధికారి మీద అయినా రెండేళ్ళకు మించి సస్పెన్షన్ చేయడానికి వీలు లేదు.

కానీ ఏబీ వెంకటేశ్వరరావు విషయం లో మాత్రం రెండున్నరేళ్ళు గడచిపోయాయి. దాంతో ఆయన ఏకంగా సుప్రీం కోర్టులో న్యాయం కోరుతూ పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ ఆయనకు సానుకూలం గా తీర్పు వచ్చింది. ఏబీవీని వెంటనే విధులలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

దాంతో కోర్టు ఆర్డర్లను పట్టుకుని రెండు వరాలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్న ఏబీవీకి ఈ రోజుకీ పోస్టింగ్ అయితే లేదు. ఆయన ఈ మధ్యలో ఒకసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి తనను పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం అమలు జరిగేలా చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పినా ఆచరణ లో మాత్రం ఏమీ చేయలేదని అంటున్నారు.

ఇప్పటికే కొందరు సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు జరిగాయి. మరి అపుడు ఏదైనా పోస్టింగ్ ఏబీవీకి ఇస్తారనుకుంటే అది కూడా జరగలేదు. తనకు పోస్టింగ్ తో పాటు పూర్తి జీతం ఇవ్వాలని ఏబీవీ కోరుతున్నారు. ఇక తాజాగా ఆయన మరోసారి సచివాలయానికి వెళ్ళినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే లేరు. దాంతో ఆయన మళ్లీ ఆయనను కలవాలని నిర్ణయించుకున్నారు.

ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా వెంకటేశ్వరావుకు పోస్టింగ్ ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది అన్నదే ఇక్కడ చర్చ. నిజంగా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా ఎంతకాలం ఆపుతారు అన్నది కూడా చూడాలి. ఈసారి ఆయన సుప్రీం కోర్టు ఆదేశాలతో వచ్చారు. కాదూ కూడదు అనుకుంటే అది సుప్రీం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది అంటున్నారు.

మరి ఆ విధంగా చేసి పరిస్థితిని అంత వరకూ తెచ్చుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే కనుక జరిగితే ఫలితాలు పర్యవసానాలు ఏంటి అన్నది కూడా అధికారులలో  కలవరం కలిగిస్తోంది అంటున్నారు. ఏది ఏమైనా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకూడదు అని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకుంటే ఈ వ్యవహారం చాలా  సీరియస్ గానే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News