రాజకీయ చక్రం తిప్పిన ఆరోపణలు - సీనియర్ ఐపీఎస్ సస్పెన్షన్ రగడ

Update: 2020-02-10 01:30 GMT
టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌ గా పని చేసిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సస్పెన్షన్ వ్యవహారంపై టీడీపీ - వైసీపీ మధ్య మాటల యుద్ధంతో పాటు ట్విట్టర్ వార్ నడుస్తోంది. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. గత ఏడాది మే 30వ తేదీన ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తప్పించింది ప్రభుత్వం. పోస్టింగ్ కోసం వెయిటింగ్‌ లో ఉంచింది. 8 నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసింది.

విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఇజ్రాయెల్‌ కు చెందిన ఓ సంస్థకు ఇంటెలిజెన్స్ అండ్ సర్వైవలెన్స్ కాంట్రాక్ట్ అప్పగింతలో అవతకవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. నిఘా పరికరాల కొనుగోలు అంశానికి సంబంధించి ఆ సంస్థ తరఫున బిడ్ దాఖలు చేసిన ఆయన కొడుకు టెండర్ల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ హోదాలో ఉండి జాతీయ భద్రతకు భంగం వాటిల్లేలా వెంకటేశ్వర రావు విదేశీ సంస్థతో నిఘా సమాచారం పంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసు బలగాలకు నాణ్యతలేని సెక్యూరిటీ పరికరాలు అందించారని, అలాగే పోలీసు సిబ్బంది నియామకాల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపణ.

వీటితో పాటు రాజకీయ ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. వైసీపీ నుంచి టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల వలసల వ్యవహారంలో తెరవెనుక కీలకపాత్ర పోషించారనే అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వెంకటేశ్వర రావుపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. ఏబీ వెంకటేశ్వర రావు ప్రజల కోసం కాకుండా చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేశారని - గతంలో వైసీపీని దెబ్బతీసేందుకు నిఘా వ్యవస్థను ఉపయోగించారన్నారు. గతంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా ఏబీ వెంకటేశ్వర రావు అంశంపై ట్వీట్ చేసినట్లుగా చెబుతారు.

మొత్తానికి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశం టీడీపీ - వైసీపీ మధ్య వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో స్వయంగా ఈ ఆధికారి.. అధికార - ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేశానా.. మీరంతా కలిసి ఓ అభిప్రాయానికి రావాలని - తనకు కూడా ఓ క్లారిటీ వస్తుందని - మీరంతా పార్లమెంటులో కలిసి మెలిసి ఉంటారని పేర్కొన్నారు.

అంతకుముందు కూడా తన సస్పెన్షన్‌ పై బంధుమిత్రులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియాలో వస్తున్న కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని - సస్పెన్షన్ వల్ల మానసికంగా తనకు వచ్చే ఇబ్బంది కూడా ఏమీ లేదని - కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ చర్యను (సస్పెన్షన్) ఎదుర్కొనేందుకు చట్టపరంగా తనకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నానని, తదుపరి ఏమిటనేది క్రమంగా మీకూ తెలుస్తుందన్నారు.


Tags:    

Similar News