'అబ్బ‌య్య‌' దెబ్బ‌కు!... టీడీపీ గుల్ల గుల్లేగా!

Update: 2019-02-26 09:51 GMT
ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట‌గా ముందు ఏ జిల్లా పేరును చెప్పుకోవాల‌న్న ప్ర‌శ్న‌కు ఠ‌క్కున వినిపించే స‌మాధానం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లానే. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలోని అన్ని పార్లమెంటు సీట్ల‌తో పాటు అన్ని అసెంబ్లీ సీట్లు కూడా టీడీపీ ఖాతాలో ప‌డిపోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. మొత్తంగా మొత్తం సీట్ల‌ను ఇచ్చిన జిల్లాగా ఈ జిల్లాపై టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఎంత గొప్ప‌లు చెప్పుకున్నారో కూడా చూశాం. అయితే ఇదంతా గ‌తం. ప్ర‌స్తుతానికి వస్తే... ఈ జిల్లాలో ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో టీడీపీకి ఎదురీత త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఏ కాక‌లు తీరిన రాజ‌కీయ నేతో కాదు. ఇటీవ‌లే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యువ‌నేత‌, వైసీపీ దెందులూరు వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త కొఠారు అబ్బ‌య్య  చౌద‌రేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విద్యాధికుడైన అబ్బ‌య్య‌... విదేశాల్లో త‌న వృత్తిని వ‌దులుకుని సొంతూరు చేరి తండ్రి వాస‌ర‌త్వంగా రాజ‌కీల్లోకి దిగేశారు. ప‌శ్చిమ గోదావ‌రి... అందులోనూ ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ను ఢీకొట్టేందుకు సై అన్న అబ్బ‌య్య‌... ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లోనే సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారిపోయార‌ని చెప్పాలి.

మొన్న‌టికి మొన్న త‌న జ‌న్మదినాన‌... నిర్వ‌హించిన భారీ బైక్ ర్యాలీ గురించి రాష్ట్రమంతా చ‌ర్చ జ‌రిగిందంటేనే అబ్బ‌య్య ఏ రీతిన దూసుకెళుతున్నారో ఇట్టే చెప్పేయొచ్చు. మాట‌లోనే కాకుండా వ్య‌వ‌హారంలోనే కాస్తంత నింపాదిగానే వెళుతున్న అబ్బ‌య్య‌... ఫ‌లితాల సాధ‌న‌లో మాత్రం జెట్ స్పీడుతోనే సాగుతున్నార‌ని చెప్పాలి. నియోజ‌క‌వ‌ర్గంలోని దాదాపుగా అన్ని గ్రామాల‌ను ఇప్పటికే చుట్టేసిన అబ్బ‌య్య‌... ఆయా గ్రామాల్లోని అన్ని వ‌ర్గాల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. టీడీపీ హ‌యాంలో జ‌రుగుతున్న అన్యాయాల‌ను వివ‌రించి చెప్ప‌డంలో త‌న‌దైన స్టైల్ ను ఫాలో అవుతున్న అబ్బ‌య్య‌... మంచి రిజ‌ల్ట్స్ సాధించారు. ఇటీవల జిల్లా కేంద్రం ఏలూరులో జ‌రిగిన వైసీపీ బీసీ గ‌ర్జ‌న‌కు త‌ర‌లివచ్చిన బీసీల్లో దెందులూరు బీసీల‌దే అగ్ర‌స్థాన‌మ‌ట‌. బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ.... త‌న పాల‌న‌లో బీసీల‌కు ఏం చేసిందో వివ‌రించ‌డంతోనే త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని బీసీల్లో మెజారిటీ శాతాన్ని వైసీపీ వైపున‌కు అబ్బ‌య్య తిప్పేశార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇక దెందులూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ దూకుడు స్వ‌భావానికి ఏమాత్రం బెదిరిపోని రీతిలో దూసుకెళుతున్న అబ్బ‌య్య‌... చింత‌మ‌నేనికి సంబంధించిన ప్ర‌తి వివాదాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్లడంలోనూ స‌క్సెస్ సాధించారు.

ఎస్సీల‌ను కించ‌ప‌రుస్తూ చింత‌మ‌నేని చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌పై ఇటీవ‌ల జ‌రిగిన రాద్ధాంత‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. ఈ చ‌ర్య‌తో చింత‌మ‌నేని వెంట ఉన్న ఎస్సీల్లో మెజారిటీ వ‌ర్గాన్ని అబ్బ‌య్య వైసీపీ వైపు తిప్పేశారు. ఇక ఇదే వివాదంలో రెండో అరెస్ట్ ను కూడా అబ్బ‌య్య వ్యూహాత్మ‌కంగా త‌న‌కు, వైసీపీకి అనుకూలంగా మార్చేశారు. ఈ కేసులో రెండో అరెస్ట్‌గా పోలీసులు అదుపులోకి తీసుకున్న నాని అనే యువ‌కుడు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి అట‌. నానికి పెళ్లి జ‌రిగిన మ‌రునాడే... పెళ్లి మంట‌పంలోకి వెళ్లిన పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. విష‌యం తెలుసుకున్న అబ్బ‌య్య చాలా వేగంగా రియాక్ట్ కావ‌డం, అప్ప‌టిక‌ప్పుడే పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు రెండు వేల మందికిపైగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు చేర‌డంతో పోలీసులు డంగైపోయార‌ట‌. అర్థ‌రాత్రి అరెస్ట్ చేసి... రాత్రంతా చిత్ర‌హింస‌ల‌కు గురి చేయ‌డం ద్వారా వైసీపీ శ్రేణుల్లో ఓ మోస్త‌రు భ‌యాందోళ‌న‌ల‌ను క్రియేట్ చేయాల‌న్న పోలీసుల వ్యూహం అబ్బ‌య్య క్విక్ రియాక్ష‌న్ ముందు పార‌లేదు. వైసీపీ కార్య‌క‌ర్త‌లు వేలాదిగా త‌ర‌లిరావ‌డంతో పోలీసులు నానిని జ‌డ్జి ముందు హాజ‌రుప‌రచ‌క త‌ప్ప‌లేదు. ఈ త‌ర‌హా కేసుల్లో వెనువెంట‌నే బెయిల్ ల‌భిస్తున్న నేప‌థ్యంలో నానికి కూడా అక్క‌డిక‌క్క‌డే బెయిల్ ల‌భించేసింది.

ఈ విష‌యంలోనూ అబ్య‌య్య ర‌చించిన మంత్రాంగంతో... నానిని పోలీసులు అవ‌మానించిన తీరు, పెళ్లి ఇంటి నుంచి అత‌డికి తీసుకెళ్ల‌డం వంటి వాటిని అబ్బ‌య్య జ‌నాల్లోకి వెళ్లేలా చేశారు. దీంతో క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనూ ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారు ద‌మ‌న నీతిపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌. మొత్తంగా ఒక్క‌టొక్క‌టిగానే దాదాపుగా అన్ని సామాజిక వ‌ర్గాల‌ను టీడీపీకి దూరం చేస్తున్న అబ్బ‌య్య చౌద‌రి.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఈ ద‌ఫా టీడీపీకి చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మేన‌న్న వాదన వినిపిస్తోంది. జ‌నంలో ఓ మంచి ముద్ర వేయించుకున్న అబ్బ‌య్య‌... తాజాగా అధికార పార్టీ పాల్ప‌డుతున్న దురాగ‌తాల‌ను ఎండ‌గ‌ట్టడం మొద‌లెట్టేశారు. ఇందులో భాగంగానే నాని అరెస్ట్‌ - నిన్న చెవిరెడ్డి అరెస్ట్‌ ల‌పై వేగంగా స్పందించిన అబ్బ‌య్య‌... టీడీపీ నేత‌ల‌ను ప‌చ్చ నేత‌లుగా - కొంద‌రు పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పాటుగా ఏకంగా టీడీపీ వ్య‌వ‌హార స‌ర‌ళిపై ఏకంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కూడా ఫిర్యాదు చేసే దిశ‌గా వెళుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మొత్తంగా జిల్లాలో టీడీపీకి భారీ దెబ్బ కొట్టే దిశ‌గా అబ్బ‌య్య... సైలెంట్‌గానే త‌న వ్యూహానికి ప‌దును పెట్టేస్తున్నార‌ని చెప్పాలి.
Tags:    

Similar News