ఒకళ్లు బతకాలని.. ఒకళ్లు చావాలని

Update: 2015-07-30 11:59 GMT
గురువారం భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇద్దరు వ్యక్తుల అంతిమ యాత్రలు జరిగాయి. ఒక వ్యక్తిని ఉరి తీస్తే.. చనిపోయిన మరో వ్యక్తి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. విచిత్రంగా దేశంలోని మెజారిటీ ప్రజలు వీరిలో ఒక వ్యక్తి ఇంకా బతికి ఉంటే బాగుంటుందని కోరుకుంటే.. మరొక వ్యక్తి చనిపోవాలని డిమాండ్ చేశారు. వారిలో ఒకరు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అయితే.. మరొకరు యాకూబ్ మెమన్. విచిత్రంగా ఇద్దరూ మూస్లిములే. మరో విచిత్రం ఏమిటంటే, బతకాలని కోరుకున్న వాళ్లకు హిందువులంతా కులమతాలకతీతంగా మద్దతు ఇస్తే.. చనిపోవాలని కోరుకున్న వాళ్లకు ముస్లిముల్లోని ఒక వర్గం సంపూర్ణ మద్దతు ఇచ్చింది. కానీ, అబ్దుల్ కలామ్ గురించి ఆ వర్గం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మరో విశేషం. కనీసం ఆయనకు నివాళి కూడా ఘటించకపోవడం మరో విశేషం.

అబ్దుల్ కలామ్ ముస్లిముల్లోనే మేలిమి బంగారంలా మెరిశారు. ముస్లిం అయినా ఆయనను ఎవరూ ముస్లింలా చూడలేదు. కుల మతాలకతీతంగా ఒక భారతీయుడిలా చూశారు. మరణ శిక్షను కూడా వ్యతిరేకించి అందరూ బతకాలని, మంచిగా సంతోషంగా బతకాలని అబ్దుల్ కలామ్ కోరుకుంటే.. దాదాపు 300 మందికి మరణ శిక్ష విధించి యాకూబ్ మెమన్ మరణ శిక్షకు గురయ్యాడు. ఒకరిది ప్రేమ మార్గం అయితే.. మరొకరిది ద్వేష మార్గం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ అబ్దుల్ కలామ్ కథలను చదివి కనీసం ఒక్క కన్నీరైనా కారిస్తే.. యాకూబ్ మెమన్ చేసిన పాపాలు తెలిసినవాళ్లు అతడికి మరణ శిక్ష సబబేనని వాదించారు.

భారతదేశంలో ముస్లిములు అంటే ఒక అనుమానాస్పద చూపు ఉంటుందని ఒక వర్గం ఎప్పుడూ వాదిస్తూ ఉంటుంది. కానీ దేశానికి అత్యంత ముఖ్యమైన రక్షణ వ్యవస్థకు దిశానిర్దేశం చేయడమే కాకుండా దానికి పితామహుడుగా అబ్దుల్ కలామ్ నిలిచారు. దేశ భద్రత దేశ సౌభాగ్యం ఆయన కోరుకున్నారు. కానీ, దేశ భద్రతను ప్రశ్నార్థకం చేయాలని.. దేశ సౌభాగ్యం కాకుండా పక్కనున్న పాకిస్థాన్ సౌభాగ్యంగా ఉండాలని యాకూబ్ మెమన్ కోరుకున్నాడు.

ఏ కులంలో పుట్టావు? ఏ మతంలో పుట్టావు అనే కంటే కూడా.. నువ్వు నడిచే మార్గం ఏమిటి? నీ ఆలోచనా విధానం ఏమిటి? నీ మిత్రులు ఎవరు? నీ కుటుంబం నీకు నేర్పిన సంస్కారం ఎటువంటిది? అన్న విషయాలు ప్రతి వ్యక్తి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు.  వాటి ద్వారానే వారి జీవితమూ, మరణమూ నిర్దేశితమై ఉంటాయని కూడా అంటారు. అబ్దుల్ కలామ్.. యాకూబ్ మెమన్ విషయంలో ఇది నిజమేనేమో.
Tags:    

Similar News