అభిమన్యుడు అతడు.. 'అభిమన్యు'లో ఆడుతున్నాడు

Update: 2023-01-03 05:29 GMT
అతడి పేరు అభిమన్యు ఈశ్వరన్. పేరు చూస్తే తమిళనాడు లేదా కేరళ అనుకుంటారు. కానీ, అతడు ఆడుతున్నది పశ్చిమ బెంగాల్ కు. అతడి తండ్రి పనిచేసింది లేదా ఎదిగింది డెహ్రాడూన్. అంటే ఉత్తరాఖండ్. ఇదంతా అభిమన్యు ఈశ్వరన్‌ గురించి. ఇంత వైవిధ్యం ఉన్న అభిమన్యు ఇప్పుడు తన పేరిటనే నిర్మించిన అభిమన్యు నిర్మించిన మైదానంలో ఆడుతున్నాడు.

ఇది నిజంగా విచిత్రమే. విశిష్టమే. ఇప్పటివరకు వెస్టిండీస్ దిగ్గజాలు వివియన్ రిచర్డ్స్‌, బ్రయాన్ లారా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్‌ బోర్డర్‌ వంటి వారి పేర్లపై మైదానాలు్నాయి. వీరంతా క్రికెట్‌లో దిగ్గజాలుగా ఎదిగిన వాళ్లు. కానీ, అభిమన్యు  దేశం తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అయితే, అతడి పేరిట స్టేడియం ఉండడం వెనుక పెద్ద కథే ఉంది. మంగళవారం దేహ్రాదూన్‌లోని 'అభిమన్యు క్రికెట్‌ అకాడమీ స్టేడియం'లో ఆరంభమయ్యే రంజీ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌తో బెంగాల్ జట్టు తలపడుతుంది. అభిమన్యు పేరు మీద ఈ స్టేడియాన్ని అభిమన్యు తండ్రి నిర్మించాడు.

పాలు అమ్మి.. పేపర్ వేసి

అభిమన్యు తండ్రి పేరు రంగనాథన్‌ పరమేశ్వరన్‌. డెహ్రాడూన్ లో పాలు అమ్మాడు. పేపర్ బాయ్ గానూ పనిచేశాడు. అలాఅలా చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) చదివాడు. అతడికి క్రికెట్ అంటే ప్రేమ. 1988లో డెహ్రాడూన్ లో స్థలం కొని 'అభిమన్యు క్రికెట్‌ అకాడమీ' ఏర్పాటు చేశాడు. అప్పటికి అభిమన్యు పుట్టలేదు. అతడు 1995లో జన్మించాడు. 2005లో సొంత డబ్బుతో స్థలం కొని, తర్వాతి ఏడాది స్టేడియం నిర్మాణం మొదలెట్టాడు. ఇప్పటికీ మెరుగులు దిద్దుతున్నాడు. అయితే, కొన్నేళ్ల కిందట ఈ స్టేడియాన్ని బీసీసీఐ కాంట్రాక్టుకు తీసుకుంది.

ఫ్లడ్ లైట్లు సహా అన్ని వసతులు ఉండడంతో మ్యాచ్ లు నిర్వహిస్తుంది. అత్యాధునిక వసతులతో ఉన్న ఈ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు షమి, శ్రేయస్‌, దినేశ్‌ కార్తీక్‌ కూడా ప్రాక్టీస్‌ చేశారు. అభిమన్యు కూడా ఇక్కడే శిక్షణ పొంది ఆటలో రాటుదేలాడు. ''క్రికెట్‌ నేర్చుకున్న చోటే రంజీ మ్యాచ్‌ ఆడబోతుండడం గర్వంగా ఉంది. ఆటపై నా తండ్రికి ఉన్న ప్రేమకు, ఆయన కృషికి ఇది నిదర్శనం. స్వస్థలానికి రావడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. కానీ ఒక్కసార మైదానంలో అడుగుపెడితే బెంగాల్‌ విజయంపైనే దృష్టి పెడతా'' అని అభిమన్యు చెప్పాడు. ''స్టేడియం యజమానే అందులో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన సందర్భాలు లేవనే చెప్పాలి. కానీ ఇది నాకు ఘనతేమీ కాదు. నా తనయుడు దేశానికి వంద టెస్టులు ఆడితేనే గొప్పగా ఉంటుంది'' అని రంగనాథన్‌ పేర్కొన్నాడు.

అభిమన్యు దశ తిరుగుతుందా?

అభిమన్యు ఈశ్వరన్ బెంగాల్ తరఫున రంజీల్లో అదరగొడుతున్నాడు. 27 ఏళ్ల అభిమన్యు కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతున్నాడు. అతడికి బీసీసీఐ మాజీ చైర్మన్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మద్దతు ఉంది. దీంతోపాటు అభిమన్యు సహజంగానే ప్రతిభావంతుడైన బ్యాట్స్ మన్. ఓపెనర్ గా వచ్చే అతడు 19 సెంచరీలు చేశాడు.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వీరిలో ఒకరి స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉన్నవాడు. అందుకే టీమిండియా ఇటీవలి బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే, కెప్టెన్ కేఎల్ రాహుల్, శుబ్ మన్ గిల్ ఓపెనర్లుగా రావడంతో అభిమన్యుకు అవకాశం దక్కలేదు. కానీ, అతడు మున్ముందు కచ్చితంగా టీమిండియాకు ఆడగలడు. మరోవైపు తన పేరిటే ఉన్న స్టేడియంలో మంగళవారం నుంచి జరిగే మ్యాచ్ లో రాణిస్తే అభిమన్యుకు మరింత మంచి పేరు రావడం ఖాయం.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News