పాక్ టీ యాడ్ లో అభినంద‌న్‌!

Update: 2019-03-06 10:00 GMT
యావ‌త్ భార‌త్ మొత్తం వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ ను ఎంత‌గా అభిమానిస్తున్నారో.. ఆరాధిస్తున్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అభినంద‌న్ పై క్రేజ్ ఇప్పుడు ఎంత‌వ‌ర‌కు వెళ్లిందంటే.. ఆయ‌న మీస‌క‌ట్టును వంద‌లాది మంది చేయించుకోవ‌టానికి ఇష్ట‌ప‌డుతున్నారు. కొన్ని సెలూన్లు అయితే.. అభినంద‌న్ మీస‌క‌ట్టుకు ఎలాంటి ఛార్జ్ చేయ‌టం లేదు కూడా. ఇదే కాదు.. అభినంద‌న్ పాఠాన్ని పెట్టాల‌న్న నిర్ణ‌యం ఒక ప‌క్క‌.. దేశభ‌క్తికి నిలువెత్తు రూపంగా ఇప్పుడాయ‌న మారారు.

శ‌త్రుదేశంలో ఉన్న వేళ‌.. త‌న వివ‌రాల్ని వెల్ల‌డించేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని వైనం.. ఆయన వ్య‌క్తిత్వం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. అభినంద‌న్ క్రేజ్ భార‌త్ కే ప‌రిమితం కాలేదు. పాక్ లోనూ ఇప్పుడాయ‌న ఐకాన్ గా మారారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఒక పాక్ టీ బ్రాండ్ త‌న తాజా యాడ్ లో అభినంద‌న్ ను చూపించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌టమే కాదు.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

పాక్ యుద్ధ విమానాన్ని త‌రిమికొడుతూ.. దాన్ని కూల్చేసిన అభినంద‌న్ త‌న విమానాన్ని పాక్ ద‌ళాలు కూల్చేయ‌టంతో పాక్ భూభాగంలో చిక్కుకుపోవ‌టం తెలిసిందే. తొలుత అక్క‌డి స్థానికుల చేతికి చిక్కిన ఆయ‌న్ను పాక్ ద‌ళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ సంద‌ర్భంగా అత‌డి గురించి వివ‌రాల్ని సేక‌రించే స‌మ‌యంలో పాక్ ద‌ళాలు వేసిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న చెప్పిన స‌మాధానాల‌తో కూడిన ఒక వీడియో క్లిప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

చేతిలో టీ క‌ప్పు ఇచ్చిన పాక్ అధికారులు.. ప్ర‌శ్న‌లు అడుగుతున్న క్ర‌మంలో.. టీ బాగుంద‌న్న మాట అభినంద‌న్ చెప్ప‌టం తెలిసిందే. స‌రిగ్గా  ఈ పాయింట్ ను తాజాగా త‌మ యాడ్ లో వాడుకుంది తాప‌ల్ బ్రాండ్. అభినంద‌న్ టీ తాగుతూ.. టీ చాలా బాగుంది.. థాంక్యూ అంటూ క‌నిపిస్తోంది. ఈ వీడియో సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని మ‌నోళ్ల చేతికి రావ‌టం.. ఇది కాస్తా ఇప్పుడు వైర‌ల్ గా మారింది. పాక్ కు చెందిన ప్ర‌ముఖ టీ యాడ్ అంటూ నెటిజ‌న్లు షేర్ చేసుకుంటున్నారు.

ఈ యాడ్ నేప‌థ్యంలో కొంద‌రు భార‌త అధికారుల తీరును త‌ప్పు ప‌డుతున్నారు. అభినంద‌న్ పాకిస్థాన్ లో ఫేవ‌రెట్ గా మారిపోయారు. కానీ.. మ‌న దేశంలోనే ఆయ‌న్ను రుజువులు అడుగుతున్నారు.. ఇప్ప‌టికైనా పాక్ లోని ప్ర‌ముఖ టీ కంపెనీ ఇచ్చిన యాడ్ చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అభినంద‌న్ భార‌త్ లోనే కాదు.. శ‌త్రు దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని కూడా దోచేశాడే! అవును మ‌రి.. అభినంద‌న్ కానీ పాక్ కు చిక్క‌కుంటే రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త మ‌రో స్థాయికి వెళ్లి విప‌రిణామాలు చోటు చేసుకునేవి. దానికి అడ్డుగా నిలిచింది అభినంద‌న్ ఎపిసోడే క‌దా.. అందుకే పాక్ జాతీయుల‌కు ఆయ‌నంటే అభిమాన‌మేమో?
Tags:    

Similar News