అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్.. నీ ధైర్యానికి స‌లాం!

Update: 2019-02-28 05:17 GMT
యుద్ధ విమానాన్ని ప్ర‌త్య‌ర్థులు కూల్చేసిన వేళ‌.. అందులో నుంచి క్షేమంగా బ‌య‌ట ప‌డ‌టం ఒక గుడ్ న్యూస్ అయితే.. ప్ర‌త్య‌ర్థి సేన‌ల‌కు చిక్క‌టం నిజంగానే బ్యాడ్ న్యూస్. అయితే.. అలాంటి ప‌రిస్థితుల్లోనూ ధైర్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. ఆత్మ నిబ్బ‌రంతో ఉండ‌టం అంత మామూలు విష‌యం కాదు. తాజాగా పాక్ సేన‌ల‌కు చిక్కిన యుద్ధ విమాన పైలెట్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ ధైర్యానికి.. సాహ‌సానికి సెల్యూట్ చేయాల్సిందే.

ఎందుకంటారా?.  పాక్ ఆర్మీ అధికారులు నీ పేరు ఏమిటి?   లాంటి సాదాసీదా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారే కానీ.. మీరు ఎక్క‌డి వారు.. మీరు ప్ర‌యాణిస్తున్న యుద్ధ విమానం పేరేమిటి?  మీ మిష‌న్ పేరు ఏమిటి?   లాంటి ప్ర‌శ్న‌ల‌కు.. సారీ.. నేనీ వివ‌రాల్ని చెప్ప‌లేనంటూ సూటిగా చెప్పేయ‌టం మామూలు విష‌యం కాదు.

ఇది జ‌ర‌గ‌టానికి ముందు కొన్ని అల్ల‌రి మూక‌ల దాడికి గురి కావ‌టం.. క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి.. చేతులు వెన‌క్కి విరిచి క‌ట్టివేసి.. నిల‌బెట్టి ఇంట‌రాగేష‌న్ చేసిన స‌మ‌యంలోనూ.. ఆ త‌ర్వాత గాయాల్ని స‌రి చేసి.. టీ క‌ప్పు చేతికి ఇచ్చి ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేస్తున్న‌ప్ప‌టికీ.. తాను చెప్పాల్సిన జ‌వాబులు మాత్ర‌మే చెప్పారే త‌ప్పించి.. చెప్ప‌కూడ‌ని వాటి గురించి పెద‌వి విప్ప‌లేదు.

మ‌రింత ధైర్యంగా.. శ‌త్రు సైన‌లకు జ‌వాబు చెప్ప‌టానికి ధైర్యం.. ఆత్మ‌స్థైర్యం ఎంత కావాలి?  అదంతా త‌న‌లో చాలానే ఉంద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేసిన మ‌న యుద్ధ విమాన పైలెట్ అభినంద‌న్ వ‌ర్ద‌న్ కు స‌లాం చేయాల్సిందే. ఆయ‌న‌కు.. ఆయ‌న కుటుంబానికి దేశ జ‌నులంతా అండ‌గా ఉండాల్సిందే. అదే స‌మ‌యంలో వారింటి చుట్టు చేరిన మీడియా అత్యుత్సాహానికి బ్రేకులు వేయాలి. ఇలాంటి వేళ‌లో వారి భావోద్వేగాల్ని గుర్తించి వారికి ఇవ్వాల్సిన ప్రైవ‌సీ ఇస్తే బాగుంటుంది.
Tags:    

Similar News