ప‌ది రోజుల జ‌గ‌న్ పాల‌న‌పై ఆర్కే పొగ‌డ్త‌లు విన్నారా?

Update: 2019-06-09 06:46 GMT
రాజ‌కీయ వైరం మామూలే. బ‌ద్ధ శ‌త్రువులు సైతం కొన్ని సంద‌ర్భాల్లో ఇట్టే క‌లిసిపోతారు. అందుకే రాజ‌కీయాల్లో శాశ్విత శ‌త్రువులు.. శాశ్విత మిత్రులు అన్నోళ్లు అస్స‌లు ఉండ‌రు. ఆ విష‌యం రాజ‌కీయాల మీద క‌నీస అవ‌గాహ‌న ఉన్న వారు సైతం త‌ర‌చూ ప్ర‌స్తావిస్తుంటారు. రాజ‌కీయ వైరానికి మించిన వైరం మ‌రొక‌టి ఉంది. అది.. సైద్ధాంతిక వైరం. రెండు భిన్న సైద్ధాంతిక వాద‌న‌లు ఎప్పుడూ ఎక్క‌డా క‌లిసింది ఉండ‌దు.

త‌న‌ను అదే ప‌నిగా పచ్చ మీడియాగా అభివ‌ర్ణించే ప్ర‌త్య‌ర్థుల‌ను ఉద్దేశించి ఆంధ్ర‌జ్యోతి య‌జ‌మాని రాధాకృష్ణ పాజిటివ్ గా రియాక్ట్ కావ‌టం సాధ్య‌మేనా? అంటే నో అని చెప్పేస్తారు. బాబును భుజాల మీద ఎక్కించుకొని మోసిన ఆర్కే లాంటోళ్లు.. జ‌గ‌న్ ను.. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యాణాన్ని ప్ర‌తిసారి ఎంత‌లా నిందించారో.. మ‌రెంత‌లా ఆరోప‌ణ‌లు గుప్పించారో తెలిసిందే.

అలాంటి వారు.. ఏపీ ముఖ్యమంత్రిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ది రోజుల ప‌ని తీరు మీద ఎలా రియాక్ట్ అయ్యార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. సైద్ధాంతిక విభేదాలు ఉన్న వారు ప్ర‌తి విష‌యంలోనూ లోపాలే వెతుకుతారు. కానీ.. అందుకు భిన్నంగా తాజాగా తాను రాసే వీకెండ్ కామెంట్ లో ఆర్కే రాసిన వ్యాసం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఉంది.

తాజాగా ఆయ‌న రాత‌లు చూస్తే.. జ‌గ‌న్ తో ఆయ‌న సంధి చేసుకోవాల‌న్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలకు మ‌ద్ద‌తు ప‌లుకుతూనే..అలా అని పూర్తిగా పొగిడేయ‌కున్నా.. మంచిని మంచి అని చెప్ప‌టానికి ప‌డే మొహ‌మాటం ఆయ‌న మాట‌ల్లో వినిపించింది. అయితే.. రాత‌లోని టోన్ పాజిటివ్ గా ఉండ‌టంతో పాటు.. సాపేక్షంగా చెప్పిన‌ట్లుగా చెప్పుకొచ్చారు. దీన్ని జ‌గ‌న్ సాధించిన విజ‌యంగా చెబుదామా?  లేదంటే.. త‌ప్పును త‌ప్పుగా.. ఒప్పును ఒప్పుగా మాత్ర‌మే చూస్తాను త‌ప్పించి.. నేను అంద‌రిలాంటి వాడిని ఎంత‌మాత్రం కాదన్న విష‌యాన్ని ఆర్కే చెప్ప‌ద‌లుచుకున్నారా? అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి.

త‌న తాజా వీకెండ్ కామెంట్లో జ‌గ‌న్ పాల‌న‌పై ఆర్కే చేసిన పాజిటివ్ కామెంట్స్ ను చూస్తే..

+   ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అధికారుల నియామకాలు, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి జగన్మోహన్‌ రెడ్డి వేసిన అడుగులు ఆయనకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి.

+   తండ్రి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి వ్యవహరించిన తీరును గమనించిన వారికి ఆయన ముఖ్యమంత్రి అయితే..? అన్న భయాలు ఉండేవి. కానీ, తన గతాన్ని ప్రజలు మర్చిపోయేలా జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

+  పాలనలో అవినీతి నిర్మూలనకు, పారదర్శకతకు పెద్దపీట వేస్తామని పదే పదే చెబుతున్న ఆయన, అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నారనే చెప్పాలి. దీంతో, ఇప్పటి వరకు జగన్‌ను వ్యతిరేకించిన వర్గాలన్నీ ఇకపై ఆయన వేయబోయే అడుగులు, వ్యవహరించబోయే తీరు పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆ జగన్మోహన్‌ రెడ్డి, ఈ జగన్మోహన్‌ రెడ్డి ఒక్కరేనా అని సందేహపడుతున్నాయి.  
 
+   ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏమేమి తప్పులు చేశారో గమనించిన జగన్మోహన్‌ రెడ్డి, తాను ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో, తన నిర్ణయాలను ఎవరూ ప్రభావితం చేయలేరన్న సంకేతాలను కూడా స్పష్టంగా పంపిస్తున్నారు.

+  రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం కలగకుండా జాగ్రత్త పడుతున్నారు.తెలుగు దేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్న బీసీలను ఆకట్టుకోవడానికై మంత్రి పదవులలో ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో, కాపులకు కూడా పెద్దపీట వేశారు.
Tags:    

Similar News