అబార్ష‌న్.. విదేశాల్లో నిబంధ‌న‌లు ఇలా!

Update: 2022-09-30 07:43 GMT
పెళ్లయిన‌వారితోపాటు అవివాహితులు సైతం సుర‌క్షిత గ‌ర్భ‌స్రావం (అబార్ష‌న్‌)కు అర్హులేన‌ని భార‌త సుప్రీంకోర్టు తాజాగా సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. గ‌ర్భం దాల్చిన 24 వారాల్లోపు పెళ్లియిన‌వారు, పెళ్లి కానివారు, భార్య‌కు ఇష్టం లేకుండా భ‌ర్త ర‌తి చేయ‌డం వ‌ల్ల గ‌ర్భం దాల్చిన‌వాళ్లు సుర‌క్షిత ప‌ద్ధ‌తుల్లో అబార్ష‌న్ చేయించుకోవ‌చ్చ‌ని త‌న తాజా తీర్పులో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో పెళ్ల‌యినివారు, పెళ్లికాని వారు అంటూ తేడా చూపించ‌క‌పోవ‌డం స‌రికాద‌ని సుప్రీంకోర్టు పేర్కొంది.

సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌కారం.. వివాహితలతో పాటు అత్యాచార బాధితులు, మైనర్లు, మానసిక సమస్యలున్న వారు, పిండం సరిగా అభివృద్ధి చెందనివారు, పెళ్లికానివారు (అవివాహిత‌లు), వితంత‌వులు 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కుంది.

సుప్రీంకోర్టు తాజా తీర్పు నేప‌థ్యంలో విదేశాల్లో అబార్ష‌న్ రూల్స్ చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఎందుకంటే ఆయా దేశాల్లో భారతీయులు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. గ‌తంలో ఐర్లాండ్‌లో అబార్ష‌న్ కు అనుమ‌తి లేక‌పోవ‌డంతో బిడ్డ అడ్డం తిరిగి భార‌తీయ వైద్యురాలు ఒకామె మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇటీవ‌ల అగ్ర‌దేశం అమెరికా సుప్రీంకోర్టు అబార్ష‌న్ల‌పై మ‌హిళ‌ల‌కు ఉన్న హ‌క్కును తోసిపుచ్చింది. కొన్ని ప‌రిమితుల మ‌ధ్య మాత్ర‌మే అబార్ష‌న్‌కు అంగీక‌రించింది. ఫ‌లితంగా 50 ఏళ్ల నుంచి మ‌హిళ‌ల‌కు ఉంటున్న అబార్ష‌న్ హక్కును తొల‌గించింది. కేవ‌లం కొన్ని సంద‌ర్భాల్లో మాత్ర‌మే అబార్ష‌న్‌కు వీల‌వుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

కాగా అబార్ష‌న్ల‌కు సంబంధించి యూర‌ప్‌లో చ‌ట్టాలు సుల‌భంగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే ఆఫ్రికాలో అయితే చ‌ట్టాలు చాలా క‌ఠినంగా ఉన్నాయ‌ని అంటున్నారు.

అలాగే విచ్చ‌ల‌విడిగా పెరిగిపోతున్న జ‌నాభాను నియంత్రించ‌డానికి చైనా అబార్ష‌న్ల‌ను ఒక‌ప్పుడు ప్రోత్స‌హించింది. అయితే ఇప్పుడు ఆ దేశంలో జ‌న‌నాల సంఖ్య బాగా త‌గ్గుముఖం ప‌ట్టింది. వృద్ధుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతోంది. దీంతో అబార్ష‌న్ చేయించుకోవ‌డానికి వీల్లేద‌ని గతేడాది చైనా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక యూర‌ప్‌లోని అత్యధిక దేశాల్లో 12–14 వారాల్లోపు అబార్షన్‌ చేయించుకోవ‌చ్చు. బ్రిట‌న్‌లో 24 వారాలవరకు అబార్షన్‌ చేయించుకోవచ్చు. యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే)లో అయితే గర్భంలో శిశువు సరిగా ఎదగలేదని తేలితే ఎన్నో నెలలో అయినా అబార్ష‌న్ చేయించుకునే హక్కు మ‌హిళ‌ల‌కుంది. కెనడాలో గర్భవిచ్ఛిత్తికి ప్రత్యేకంగా చట్టం లేకపోయినప్పటికీ ఏ దశలోనైనా అబార్షన్‌ చేయించుకోవచ్చు.

లాటిన్‌ అమెరికా దేశ‌మైన‌ కొలంబియాలో 24 వారాల్లోపు అబార్షన్‌ చేయించుకోవ‌చ్చు. ఐర్లాండ్‌లో అబార్షన్‌ చట్టాలకు పరిమితులు విధించడాన్ని 2018లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మహిళలు తిరస్కరించారు. దీంతో గ‌ర్భం దాల్చిన 12 వారాల్లోపు ఎప్పుడైనా అబార్ష‌న్‌కు అవ‌కాశం ఉంది. అలాగే న్యూజిలాండ్‌లో 2020లోనే మహిళలకు అబార్షన్లపై హ‌క్కులు క‌ల్పించారు.  

కానీ 24 దేశాల్లో మాత్రం అబార్షన్ (గ‌ర్భస్రావం) చేయించుకోవ‌డం చ‌ట్ట‌విరుద్ధం. వీటిలో అత్య‌ధికం ఆఫ్రికా దేశాలే కావ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత ఆసియా, సెంట్ర‌ల్ అమెరికా దేశాలు ఉన్నాయి.  సెనెగల్, మారిటేనియా, ఈజిప్టు, లావోస్, ఫిలిప్పైన్స్, ఎల్‌ సాల్వోడర్, హోండూరస్, పోలాండ్, మాల్టాలో అబార్ష‌న్లు చేయించుకోవ‌డం చ‌ట్ట విరుద్ధం. వీటిలోని కొన్ని దేశాల్లో అబార్షన్‌ చేయించుకుంటే కఠినమైన శిక్షలు విధిస్తారు. ఎల్ సాల్వ‌డార్‌లో అబార్షన్‌ చేయించుకుంటే జైలుకు పంపుతారు. కాగా ఈ 24 దేశాల్లో బిడ్డ‌ల‌ను క‌న‌గ‌లిగే సామ‌ర్థ్య‌మున్న మ‌హిళ‌లు 9 కోట్ల మంది వ‌ర‌కు ఉంటార‌ని అంటున్నారు. అంటే వీరంద‌రికీ అబార్ష‌న్ చేయించుకునే హ‌క్కు లేన‌ట్టే.

అలాగే మ‌రో 50 దేశాల్లో అబార్ష‌న్ చేయించుకోవ‌డానికి కొన్ని ప‌రిమితుల‌తో హ‌క్కులు ఉన్నాయ‌ని అంటున్నారు. లిబియా, ఇండోనేసియా, నైజీరియా, ఇరాన్, వెనెజులాలో తల్లి ప్రాణాలు ప్రమాదం ఉంటే అబార్షన్‌ చేయించుకోవ‌డానికి వీలుంది. మిగిలిన దేశాల్లో అత్యాచారం, అవాంఛిత గర్భాధార‌ణ‌, గర్భ‌స్థ‌ శిశువు ఎదుగుదలలో లోపాలు ఉంటే అబార్ష‌న్ చేయించుకోవ‌చ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News