ఏపీ పీసీపీ చీఫ్‌ నియామకం.. మాజీ సీఎం ఎక్కడ?

Update: 2022-11-24 05:20 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించి కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాలేదు. ఆ మాటకొస్తే నూటికి 90 శాతంపైగా నియోజకవర్గాల్లో డిపాజిట్లే రాలేదు. అప్పట్లో 2004-2014 వరకు అన్ని రకాల పదవులు పొందిన కాంగ్రెస్‌ నేతలు పార్టీ క్లిష్ట సమయంలో కాడి పారేశారు. వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు.

ఇక అప్పటి నుంచి పునర్వైభవం కోసం కాంగ్రెస్‌ కసరత్తులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పార్టీ అధిష్టానం నియమించింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా షేక్‌ మస్తాన్‌ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.

అదేవిధంగా ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, మీడియా, సోషల్‌ మీడియా కమిటీ చైర్మన్‌గా తులసి రెడ్డిలను  నియమించారు.

అదేవిధంగా 18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 33 మంది సమన్వయ కమిటీని నియమించారు. అయితే విచిత్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డికి ఏ పదవి అప్పగించకపోవడం గమనార్హం.

వాస్తవానికి 2014 ఎన్నికల ముందు కేంద్రంలోని యూపీయే ప్రభుత్వం రాష్ట్ర విభజన చేయడాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించలేదు. తన సీఎం పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ)ని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. తనకు బదులుగా తన స్థానం చిత్తూరు జిల్లా పీలేరులో తన తమ్ముడు కిశోర్‌ కుమార్‌రెడ్డిని బరిలో దించారు. అయితే జేఎస్పీ తరఫున అంతా ఓడిపోయారు.

ఆ తర్వాత కిరణ్‌కుమార్‌ రాజకీయంగా కనుమరుగై పోయారు. చాలాకాలం పాటు బెంగళూరులోనే ఉండిపోయారు. మధ్యలో జనసేన పార్టీలో చేరుతున్నారని వార్తలు వచ్చినా ఆయన చేరలేదు. అదేవిధంగా బీజేపీలో చేరతారని గాసిప్స్‌ వినిపించాయి. ఇవీ నిజం కాలేదు. ఇక ఈ ఏడాది ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీతో కిర ణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు.

రాహుల్‌గాంధీ.. కిరణ్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారని వార్తలు వచ్చాయి. కీలక బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని కోరినట్టు కూడా చెప్పుకున్నారు. అయితే విచిత్రంగా ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ కమిటీ నియామకంలో ఏ పదవిలోనూ కిరణ్‌కుమార్‌రెడ్డి లేకపోవడం గమనార్హం.

రాహుల్‌ గాంధీ తన భారత్‌ జోడో యాత్ర.. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాగినప్పుడు సైతం కిరణ్‌కుమార్‌రెడ్డి జాడ లేకపోవడం గమనార్హం. పల్లంరాజు, సుబ్బరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్‌ తదితరులంతా ఇంకా కాంగ్రెస్‌ పార్టీలోనే చురుగ్గా ఉన్నారు.

మరోవైపు దాదాపు మూడేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి జాడ మాత్రం లేదు. మరోవైపు ఆయన తమ్ముడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలోనే ఉన్నారు.

దీంతో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌లో నామ్‌ కే వాస్తే అన్నట్టు ఉన్నారని అంటున్నారు. పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టాలని.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆలోచన ఆయనకు లేవని కాంగ్రెస్‌ అధిష్టానం తాజా పీసీసీ ప్రకటనతో తేల్చిచెప్పేసిందని చెప్పుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News