కల్వకుంట్ల ఇంటిపేరుతో ఒక రేంజ్లో చక్రం తిప్పిందట!

Update: 2019-09-29 05:27 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈఎస్ ఐ మందుల కుంభకోణం గురించి తెలిసిందే. దీనికి సంబంధించి కొత్త విషయాలు సరికొత్తగా బయటకు వస్తున్నాయి. అధికారుల లీలల్ని కథలు..కథలుగా చెబుతున్నారు. ఈ స్కాంలో రెండో నిందితురాలిగా ఉన్న వరంగల్ జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె వ్యవహరించిన వైనాన్ని కథలు.. కథలుగా చెప్పుకుంటున్నారు.

తన ఇంటిపేరుతో ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదన్న కొత్త విషయం తాజాగా బయటకు వచ్చింది. తన ఇంటిపేరైన కలకుంట్లను.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పేరైన కల్వకుంట్లకు దగ్గరగా ఉండటంతో.. సింఫుల్ గా తన ఇంటిపేరును కల్వకుంట్లగా మార్చేసుకొని చక్రం తిప్పిన వైనం బయటకు వచ్చింది.

ఇంటిపేరులో ఉన్న ‘‘ల’’కు ‘‘వ’’ ఒత్తు చేర్చి.. కలకుంట్లను కల్వకుంట్లగా మార్చేసుకొని.. తాను సీఎం బంధువునంటూ హడావుడి చేసేదట. ఇంటిపేరు దగ్గరగా ఉండటం.. లకు వ ఒత్తు చేర్చిన వైనాన్ని పెద్దగా గుర్తించని వారంతా ఆమె మాటలకు పడిపోవటమే కాదు.. ఆమె ఏం చెబితే అది చేసేవారన్న వాదన వినిపిస్తోంది. సీఎం ఇంటిపేరుతో ఉందన్న ప్రచారంతోపాటు.. వారికి దగ్గర బంధువు అన్న మాట కూడా ఆమెకు తిరుగులేకుండా చేసినట్లుగా తెలుస్తోంది.

ఈఎస్ఐలో ఆమె రచ్చ ఏ స్థాయిలో ఉండేదంటే.. అప్పుడెప్పుడో ఏడాది క్రితం నిర్వహించిన హెల్త్ క్యాంప్ నకు సంబంధించిన బిల్లును తయారు చేయాల్సిందిగా ఒక వైద్యురాలికి ఆదేశాలు జారీ చేశారట. తాను క్యాంప్ బిల్లును ఎందుకు తయారు చేస్తానని.. తాను డాక్టర్ని అన్న మాటను స్పష్టంగా చెప్పినా.. ఆమె చేత బిల్లు తయారు చేసేందుకు ప్రయత్నించిన వైనం తాజాగా తెర మీదకు వచ్చింది.

అంతేకాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ది.. మాదీ ఒకే ఇంటిపేరు. ఆయన నాకు బంధువు అని నేమ్ ప్లేట్ చూపించి మరీ బెదిరించేవారట. ఆమె లీలలకు సంబంధించి పలు ఆధారాలు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. పలు ఆడియో టేపులు కూడా ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని తెలుస్తోంది. ఎంత ముఖ్యమంత్రి ఇంటి పేరుకు దగ్గరగా ఉంటే.. మరీ ఇంతలా హడావుడి చేయొచ్చా?అని విస్తుపోతున్న పరిస్థితి.
Tags:    

Similar News