స‌ముద్రంలో యాక్సిడెంట్‌.. భారీగా ట్రాఫిక్ జామ్!

Update: 2021-03-25 15:32 GMT
ఆకాశంలో భూకంపం అన్న‌ట్టు.. స‌ముద్రంలో యాక్సిడెంట్ ఏంటీ అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అలాగే జ‌రిగింది మ‌రి. త‌ర‌చూ.. స‌ముద్రంలో చిన్న చిన్న ప్ర‌మాదాలు జ‌రిగినా.. ఈ సారి మాత్రం భారీగా జ‌రిగింది. అయితే.. రోడ్డుమీద‌ వాహ‌నం మొత్తం బోర్లా ప‌డినా.. ఏవిధ‌మైన న‌ష్టం జ‌ర‌గ‌న‌ట్టుగా.. ఈ స‌ముద్రంలో జ‌రిగిన యాక్సిడెంటులోనూ పెద్ద‌గా ప్ర‌మాదం జ‌ర‌గలేదు. కానీ.. ట్రాఫిక్ మాత్రం స్తంభించిపోయింది.

ర‌వాణా మార్గానికి ఈ షిప్ అడ్డంగా నిలిచిపోవ‌డంతో.. నౌకా యానం మొత్తం స్తంభించిపోయింది. ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు లాంచీలు రాలేక ఎక్క‌డివ‌క్క‌డ నిలిచిపోయాయి. ఇదంతా ఈజీప్టులోని సూయ‌జ్ కాలువ‌లో చోటు చేసుకుంది. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున జూలియన్ అనే మ‌హిళ ఈ పిక్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టుచేయ‌డంతో ప్ర‌పంచం మొత్తం ఇప్పుడీ విష‌యం గురించి మాట్లాడుకుంటోంది.

ప్ర‌పంచంలో ప్ర‌ధాన‌మైన‌ స‌ముద్ర మార్గాల్లో సూయ‌జ్ కాలువ ఒక‌టి. భారీ నుంచి అతి భారీ నౌక‌లు ఈ మార్గం గుండా ప్ర‌యాణిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల క్రితం ‘ఎవ‌ర్ గివెన్‌’ అనే భారీ కంటెయినర్ షిప్.. చైనా నుంచి నెదర్లాండ్స్ కు పయనమైంది. అయితే.. సముద్రంలో భారీగా పెనుగాలులు వీచడంతో ఈ ఓడ ప్ర‌యాణానికి అంత‌రాయం ఏర్ప‌డింది. గాలుల తీవ్ర‌త మ‌రింత పెర‌గ‌డంతో మంగ‌ళ‌వారం ఉద‌యం కాలువ‌లోనే అడ్డం తిరిగి, అలా ఉండిపోయింది.

దాదాపు నాలుగు వంద‌ల మీట‌ర్ల పొడ‌వు, యాభై తొమ్మిది మీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న ఈ అతిభారీ నౌక సూయ‌జ్ కాలువ‌కు అడ్డంగా తిర‌గ‌డంతో ప్ర‌యాణాలు ముందుకు సాగ‌ట్లేదు. ఈ నౌక‌ను స‌రైన మార్గంలోకి తిప్పేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతూనే ఉన్నా.. ఇది ఇప్ప‌ట్లో అయ్యే ప‌ని కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీని బ‌రువు అంత ఉంది మ‌రి. ఇందులో ఉన్న గూడ్స్ తో క‌లిసి దాదాపు 2 ల‌క్ష‌ల 20 వేల ట‌న్నుల బ‌రువు ఉంటుందీ నౌక‌.

ఈ మార్గం గుండా ర‌వాణా నిలిచిపోవ‌డంతో ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. ప్ర‌పంచ వాణిజ్యంలో దాదాపు 12 శాతం ఈ మార్గం గుండానే సాగుతుంద‌ట‌. నిత్యం 10 ల‌క్ష‌ల బ్యారెల్స్ చ‌మురు కూడా ఈ దారిలోనే ప‌లు దేశాల‌కు స‌ర‌ఫ‌రా అవుతుంది. ఇంకా.. ఎన్నో విధాల వ‌స్తు, వాహ‌నాల ర‌వాణా కూడా సాగుతుంది. ఇదంతా స్తంభించిపోవ‌డంతో.. భారీ న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దాని విలువ గంట‌కు సుమారు రూ.3 వేల కోట్లుగా ఉండొచ్చ‌ని అంటున్నారు నిపుణులు.

ఈ ఓడ‌ను ప‌క్క‌కు త‌ప్పిస్తే వివిధ దేశాల‌కు చెందిన నౌక‌లు ముందుకు సాగే ప‌రిస్థితి లేదు. మ‌రి, ఆ భారీ కంటెయిన‌ర్ షిప్ ను సెట్ చేయడానికి ఎన్ని రోజులు ప‌డుతుందో..? ఎప్పుడు సూయ‌జ్ కాలువ ప్ర‌యాణం సాఫీగా సాగుతుందో చూడాలి.
Tags:    

Similar News