తిరుపతి ఎఫెక్టు.. ఆ ఇద్దరిపై వేటు తప్పదా?

Update: 2021-04-19 06:30 GMT
తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ పూర్తి అయ్యింది. మే రెండో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటివరకు వెల్లడవుతున్న అంచనా ప్రకారం విపక్షాలకు ఇబ్బంది తప్పదన్న మాట వినిపిస్తోంది. తిరుపతి ఎన్నికల్లో తాము అనుకున్నది సాధించని పక్షంలో.. ఆయా పార్టీల రథసారధులకు తిప్పలు తప్పవంటున్నారు.  ఎవరికి వారు గెలుపు తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నా.. ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లేనని చెబుతున్నారు.

తిరుపతి ఫలితం వెలువడిన తర్వాత టీడీపీ.. బీజేపీ రథసారధులపై చర్యలు తప్పవన్న మాట జోరందుకుంది. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటమేకాదు.. మిత్రుడైన పవన్ ను తమకు అనుకూలంగా మార్చుకోవటంతో మాంచి ఊపు మీద ఉన్న బీజేపీ.. తానే అభ్యర్థిని బరిలోకి దించింది. పక్కనున్న కర్ణాటకలో ఐఏఎస్ అధికారిణిగా పదవీ విరమణ చేసిన ఆమెను పార్టీలోకి తీసుకొచ్చి.. ఎన్నికల బరిలో నిలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే సమస్యలు మొదలైనట్లు చెబుతున్నారు.

మాటల్లో చెప్పినంత ప్లానింగ్ చేతల్లో లేదని.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చిన సందర్భంలో రాష్ట్ర పార్టీ నేతల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఓపక్క ఎన్నికల్లో పోటీ చేస్తూ.. మరోపక్క క్షేత్రస్థాయి కమిటీల్ని ఏర్పాటు చేయకపోవటాన్ని ఆయన తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ సారధి తీరుపై పార్టీ అధినాయకత్వం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. తిరుపతి ఫలితం ఆధారంగా సోము వీర్రాజు భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

మరోవైపు టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ఎంపిక చేయటం.. ప్రచారాన్ని నెమ్మదిగా మొదలు పెట్టి భారీ ఎత్తున నిర్వహించటం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అండ్ కో స్వయంగా రావటమే కాదు.. నియోజకవర్గం మొత్తాన్ని కవర్ చేసేలా సభలు.. సమావేశాల్ని నిర్వహించటం తెలిసిందే. అంతా బాగుందన్న వేళలో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సంబందించిన ఒక వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది.

 అందులో పార్టీని.. పార్టీ అధినేతపై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేయటం.. ఇది కాస్తా సామాన్య ప్రజలకు చేరువుగా రావటంతో..  వీడియో వైరల్ గా మారి.. పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింది. దీన్ని కవర్ చేసుకోవటానికి పడిన పాట్లు అన్నిఇన్ని కావు. ఈ వ్యవహారంపై అధినాయకుడు చాలా సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. పలితం వచ్చినంతనే చర్యల కత్తి ఝుళిపించే అవకాశమే ఎక్కువన్న మాట వినిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక పుణ్యమా అని..  ఫలితాల వెల్లడి తర్వాత ఆ ఇద్దరు నేతలపై చర్యలు తప్పవన్న మాట బలంగా వినిపిస్తుంది.
Tags:    

Similar News