ద‌త్త‌న్న అవ‌మానంపై ఏసీపీకి షాక్‌

Update: 2017-07-13 04:41 GMT
త‌ప్పు చేసే వారి విష‌యంలో చూసి చూడ‌న‌ట్లుగా ఉండ‌టం ఒక వ్యూహం. త‌ప్పు జ‌రిగిన త‌ర్వాత‌.. అది త‌న దృష్టికి వ‌చ్చిన వెంట‌నే తీవ్ర‌త‌కు త‌గ్గ‌ట్లు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌టం మ‌రో ఎత్తు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు చూస్తే.. రెండో కోవ‌లో ఆయ‌న ఉంటార‌ని చెప్పాలి. ఏదైనా ఇష్యూ చోటు చేసుకొని.. ర‌చ్చ అవుతుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన మ‌రుక్ష‌ణం.. దానిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యే ధోర‌ణిలో ఆయ‌న‌లో క‌నిపిస్తుంది.

ఇందుకు ఆయ‌న వాయు వేగంతో స్పందించే తీరు అంద‌రికి ఆక‌ట్టుకునేలా చేస్తుంది. వాస్త‌వానికి త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. కానీ.. అందుకు భిన్నంగా త‌న మైలేజీ పెరిగేలా కేసీఆర్ నిర్ణ‌యాలు ఉంటాయి. తాజాగా అలాంటిదే  మ‌రో ఉదంతం చోటు చేసుకుంది.

మహంకాళి బోనాల సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ వ్య‌వ‌హారంలో గోపాల‌పురం ఏసీపీ శ్రీనివాస‌రావుపై వేటు వేస్తూ తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఏసీపీని హెడ్ క్వార్ట‌ర్స్‌ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమ్మ వారి ఆల‌యానికి కుటుంబంతో స‌హా వెళ్లిన కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ వాహ‌నాన్ని గోపాల‌పురం ఏసీపీ ఆడ్డుకున్నారు. ప్ర‌ధాన ర‌హ‌దారిలోని రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేష‌న్ పాత బిల్డింగ్ వ‌ద్దే ఆపేశారు.

ర‌ద్దీగా ఉందంటూ వాహ‌నాన్ని నిలిపేసి.. ముందుకు పోనివ్వ‌లేదు. వాహ‌నంలో ద‌త్త‌న్న స‌తీమ‌ణి అనారోగ్యంగా ఉన్నార‌ని.. న‌డ‌వ‌లేక‌పోతున్నార‌ని చెప్పినా వాహ‌నాన్ని అనుమ‌తించేందుకు ఒప్పుకోలేదు. ద‌త్త‌న్న తిరుప‌తి ఫ్లైట్‌ కి వెళ్లాల్సి ఉన్న నేప‌థ్యంలో వెంట‌నే ద‌ర్శ‌నం చేసుకోవ‌టానికి వీలుగా వాహ‌నాన్ని అనుమ‌తించాల‌ని కోరిన స‌సేమిరా అన్నారు. దీంతో.. ద‌త్తాత్రేయ ఫ్యామిలీ న‌డుచుకుంటూ గుడికి వెళ్లి ద‌ర్శ‌నం చేసుకుంది.

ఈ వ్య‌వ‌హారం మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది. ఇదంతా జ‌రుగుతున్న వేళ‌లో అక్క‌డే ఉన్న డీసీపీ సుమ‌తి కూడా ఈ విష‌యంలో త‌ల‌దూర్చ‌లేదు. త‌న‌కు ప‌ట్ట‌న‌ట్లే వ్య‌వ‌హ‌రించారు. ఇది జ‌రిగిన కాసేప‌టికే వాహ‌నాల్లో వ‌చ్చిన ముఖ్య‌మంత్రి కుమార్తె క‌మ్ ఎంపీ క‌విత వాహ‌నంతో పాటు ప‌లువురు ఎమ్మెల్యేల వాహ‌నాల్ని సైతం దేవాల‌యానికి అతి స‌మీపం వ‌ర‌కూ అనుమ‌తించిన తీరు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ద‌త్తాత్రేయ‌కు ఒక న్యాయం..టీఆర్ ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మ‌రో న్యాయ‌మా? అంటూ తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్ కిష‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించి ముఖ్య‌మంత్రికి ఒక లేఖ రాశారు. దీనికి స్పందించిన సీఎం స‌ద‌రు గోపాల‌పురం ఏసీపీని హెడ్ క్వార్ట‌ర్స్‌ కు అటాచ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రి.. అక్క‌డే ఉండి కూడా త‌న‌కేం సంబంధం లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన డీసీపీ సుమ‌తిపై మాత్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. కిందిస్థాయి అధికారిపై తీసుకున్న త‌ర‌హాలోనే.. ఉన్న‌త‌స్థాయిలో ఉన్న అధికారుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకుంటే.. రూల్స్ విష‌యంలో అధికారులు మ‌రోసారి త‌ప్పు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News