వీళ్ళ కోరిక తీర్చకపోతే జగన్ కు కష్టమేనా ?

Update: 2021-09-01 13:30 GMT
మంత్రులతో భేటీలు, ఎంఎల్ఏలతో సమావేశాలు, ఎంపిలతో ముఖాముఖీలు కాదు తమతో భేటీ కావాలని కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు. తమతో భేటీ అయితే మాత్రమే గ్రౌండ్ లెవల్ లో పరిస్థితులు ఏమిటో జగన్ కు తెలుస్తాయని పార్టీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలపై ప్రజల అభిప్రాయాలు జగన్ కు తెలియాలంటే తమతో భేటీ అయితే మాత్రమే సాధ్యమవుతుందని కార్యకర్తలు చాలా గట్టిగా కోరుకుంటున్నారు.

ముఖాముఖి భేటీల విషయంలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల వాదనలో, డిమాండ్ లో చాలా వాస్తవముంది. ముఖ్యమంత్రిగా ఎవరున్నా మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు క్షేత్రస్ధాయిలోని వాస్తవాలను పూర్తిగా చెప్పలేరన్నది వాస్తవం. ఈ విషయం చంద్రబాబునాయుడు అయినా జగన్ విషయంలో అయినా జరిగేది ఇదే. ఐదేళ్ళ చంద్రబాబు హయాంలో మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు చేసిందిదే.

ప్రజాప్రతినిధులకు అదనంగా ఉన్నతాధికారులు, కన్సల్టెంట్లు, సలహాదారులు చంద్రబాబును పూర్తిగా తప్పుదోవ పట్టించారు. దాని ఫలితమే మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఘోరమైన ఓటమి. అప్పుడు కూడా టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు కూడా చంద్రబాబును ఇలాంటి భేటీలే పదే పదే కోరుకున్నా సాధ్యం కాలేదు. నిజానికి ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల పాత్రే చాలా కీలకమన్న విషయం తెలిసిందే.

మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి అంతటి ఘనవిజయం సాధించటంలో కూడా ఇప్పుడున్న మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలకన్నా ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలే కీలకపాత్ర పోషించారు. అలాంటి వారే ఇపుడు జగన్ తమతో నేరుగా భేటీ అవ్వాలనే కోరికను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతోంది. సహజంగానే ఏదో విషయంలో ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత మొదలయ్యే అవకాశాలను కొట్టిపారేసేందుకు లేదు.

నిజంగానే ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత మొదలైతే దాన్ని కరెక్టు చేసుకోవటానికి జగన్ కు ఇదే సరైన మార్గం అనడంలో సందేహం లేదు. ప్రభుత్వం గురించి జనాల్లోని అభిప్రాయాలు, అసంతృప్తి, వ్యతిరేకత ఇలా ఏది నిజాయితీగా తెలుసుకోవాలంటే జగన్ కు ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలతో భేటీ అవ్వటమే అత్యుత్తమమైన మార్గం. మరి వీళ్ళ కోరికను జగన్ ఎప్పటికైనా తీరుస్తారా ?


Tags:    

Similar News