ఆలీని అలా సెట్ చేయనున్న జగన్... ?

Update: 2022-01-20 00:30 GMT
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ కమేడియన్ గా ఆలీకి ఎంతో పేరుంది. ఆలీ సినిమాలో ఉంటే చాలు జనాలు ఆదరించిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. పదుల సంఖ్యలో హీరోగా కూడా చేసిన ఆలీ ఒక తరాన్ని అలా కూడా అలరించారు. ఇపుడు ఆయన ఒక ప్రముఖ టీవీ చానల్ లో షోని హోస్ట్ చేస్తున్నారు. మరో వైపు సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తూనే రాజకీయాల పట్ల కూడా తన ఆసక్తిని చాటుకుంటున్నారు. ఆలీ జీవితాశయం మంత్రి కావాలని.

ఆయన దాన్ని మనసులో ఎక్కడా దాచుకోకుండా చెప్పుకున్నారు కూడా. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరి జగన్ పార్టీ విజయానికి తనదైన తీరులో ప్రచారం చేసి పెట్టారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తిరిగి వైసీపీకి ప్లస్ అయ్యేలా చూశారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆలీకి మంచి పదవి ఇస్తారని అంతా ఆశించారు. ఆ మధ్యన  పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయితే అందులో ఆలీకి ఒకటి అన్న మాట కూడా వైరల్ అయింది.

కానీ అవేమీ జరగలేదు, ఆలీ ఆశ తీరలేదు. ఈలోగా మూడేళ్ళకు వైసీపీ పాలన దగ్గరపడుతోంది. ఈ నేపధ్యంలో ఆలీకి అందలం అందేనా అని ఆయన అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటి అంటే ఆలీ వంటి సినిమా నటుడిని ఇండైరెక్ట్ గా చట్ట సభలకు ఎంపిక చేయకుండా ప్రత్యక్ష ఎన్నికల్లోనే నిలబెట్టి మరింతగా సేవలను వాడుకుంటారు అని అంటున్నారు.

ఆలీది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రీ. దాంతో ఆయనను వచ్చే ఎన్నికల్లో రాజమండ్రీ సిటీ నుంచి వైసీపీ తరఫున పోటీకి దించుతారు అని అంటున్నారు. ఇక్కడ చూస్తే టీడీపీ గట్టిగా ఉంది. టీడీపీ ఆవిర్భవించాక ఇప్పటిదాక తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే అయిదు సార్లు టీడీపీ విజయం సాధించింది. అందులో నాలుగు సార్లు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. ఇక లేటెస్ట్ గా 2019 ఎన్నికల్లో కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యే అయ్యారు.

ఇక మూడు సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ మద్దతుతో బీజేపీ ఇక్కడ గెలిచాయి. దాంతో టీడీపీకి కంచుకోట లాంటి సిటీ సీటుని కొట్టాలీ అంటే ఆలీ సినీ గ్లామర్ అవసరమని వైసీపీ భావిస్తోందని టాక్. ఇక్కడ ప్రస్తుతం వైసీపీకి ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే  రౌతు సూర్యప్రకాశరావు పెద్దగా దూకుడు చేయడంలేదు అని వైసీపీ భావిస్తోందిట.  దాంతో ఆలీ చట్ట సభల్లో అడుగుపెట్టాలీ అంటే మరో ఎండున్నరేళ్ళ పాటు వెయిట్ చేయకతప్పదా అన్న మాట కూడా ఫ్యాన్స్ నుంచి వస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News