అవార్డులు తిరిగి ఇవ్వ‌టానికి నేనేమైనా పిచ్చోడ్నా?

Update: 2017-10-03 05:36 GMT
న‌రేంద్ర మోడీని అభిమానించే వారు ఎంత‌మందో ఆయ‌న తీరును త‌ప్పు ప‌ట్టే వారు అంతేమంది. ప్ర‌ధాని కాక ముందే మోడీపై చాలామంది ఒక‌లాంటి అభిప్రాయంతో ఉండేవారు. ప్ర‌ధాని అయ్యాక.. మారిన ఆయ‌న మాట‌ల కార‌ణంగా చాలామంది ఆయ‌న‌పై గ‌తంలో మాదిరి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌టం త‌గ్గించారు.

ఆద్యంతం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉండే మోడీ మాట‌ల మ‌ర్మం.. ఆయ‌న తీరుపై ఈ మ‌ధ్య‌న మ‌ళ్లీ విమ‌ర్శ‌లు మొద‌లువుతున్నాయి. పెద్ద నోట్ల ర‌ద్దు.. జీఎస్టీల‌ను ఘ‌న‌కార్యాలుగా ఆయ‌న అభివ‌ర్ణించుకోవ‌టం.. వాటి కార‌ణంగా చోటు చేసుకున్న న‌ష్టాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్న కొద్దీ మోడీని వ్య‌తిరేకించే వారి గ‌ళాల బ‌లం పెర‌గుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌న బెంగ‌ళూరులో జ‌ర్న‌లిస్ట్ గౌరీ లంకేశ్ కిరాత‌కంగా హ‌త్య చేసిన వైనం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. దీనిపై జ‌ర్న‌లిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ హ‌త్య‌ను ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు ఖండించినా ప్ర‌ధాని మోడీ మాత్రం రియాక్ట్ అయ్యింది లేదు. దీనిపై ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఒక ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌ధాని మోడీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌ట‌మే కాదు.. త‌న కంటే మోడీ పెద్ద న‌టుడ‌ని.. త‌న‌లాంటి న‌టుడికి ఎవ‌రు న‌టిస్తున్నారో.. ఎవ‌రు నిజంగా స్పందిస్తున్నారో అన్న వ్య‌త్యాసాన్ని గుర్తిస్తామ‌ని చెప్పుకున్నారు. జ‌ర్న‌లిస్ట్ గౌరీ లంకేశ్ హ‌త్య జ‌రిగి నెల రోజులు  అవుతున్నా ప్ర‌ధాని మోడీ స్పందించ‌క‌పోవ‌టం ఏమిటంటూ ప్ర‌కాశ్ రాజ్ మండిప‌డుతున్నారు.

బెంగళూరులో జ‌రిగిన ఒక ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న‌..గౌరీ లంకేశ్ హ‌త్య విష‌యంలో ప్ర‌ధాని మోడీ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ.. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న నిశ్శ‌బ్దం స‌రికాద‌న్నారు. త‌న‌కు 5 జాతీయ పుర‌స్కారాలు ల‌భించిన‌ట్లు ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. మోడీతో పాటు యూపీ సీఎంపైనా  ప్ర‌కాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త‌న‌కు యోగిని చూస్తే యూపీ ముఖ్య‌మంత్రా?  లేక‌.. గుడిలో పూజారా? అన్న‌ది అర్థం కాన‌ట్లుగా ఉంటుంద‌న్నారు.

త‌న న‌ట‌న‌ను మెచ్చి ఇచ్చిన జాతీయ అవార్డుల్ని ప్ర‌స్తావిస్తూ.. న‌ట‌న‌లో మోడీ త‌న‌ను మించి పోయారన్న వ్యాఖ్య‌తో పాటు.. ఆయ‌న‌కు నేను అవార్డు ఇవ్వాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌కాశ్ రాజ్ మాట‌ల్ని అర్థం చేసుకునే విష‌యంలో మీడియాలో దొర్లిన త‌ప్పుతో త‌న‌కొచ్చిన జాతీయ అవార్డుల్ని వెన‌క్కి ఇస్తాన‌ని వ్యాఖ్యానించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చేశాయి. దీంతో.. త‌న మాట‌ను మ‌రింత స్ప‌ష్టంగా చెప్పేందుకు ట్విట్ట‌ర్లో ఒక వీడియో ట్వీట్ చేసి క్లారిటీ చేశారు. తన‌కు ఇచ్చిన అవార్డుల్ని వెన‌క్కి ఇస్తాన‌ని తాను చెప్ప‌లేద‌ని..అయినా ఆ మాట అన‌టానికి తానేమైనా పిచ్చోడ్నా (ఫూల్‌) అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఒక ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి ఈ స్థాయిలో విరుచుకుప‌డుతూ వ్యాఖ్య‌లు చేయ‌టం ఇప్పుడు తీవ్ర సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 

Full View
Tags:    

Similar News