గత ఏడాది అక్టోబర్ లో బెంగుళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ను పట్టపగలు కొందరు దుండగులు హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గౌరీ లంకేశ్ కు దూరపు బంధువు - వామపక్ష భావాలున్న ప్రకాశ్ రాజ్...ఆ ఘటనపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. గతంలో కల్బుర్గి - దబోల్కర్ - పన్సరేల తరహాలోనే గౌరీ లంకేశ్ హత్య కూడా జరిగిందని.....గౌరీ లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. అడపాదడపా....బీజేపీ నేతలపై - ప్రభుత్వంపై జస్ట్ ఆస్కింగ్ పేరుతో ట్విట్టర్ లో ప్రకాశ్ రాజ్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా, సిర్సిలోని రాఘవేంద్ర మఠంలో ‘మన రాజ్యాంగం- మన హోదా’ పేరుతో వామపక్ష మేధావులు ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డెపై ప్రకాష్ రాజ్ ఘాటుగా విమర్శలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలకు మండిపడ్డ బీజేపీ శ్రేణులు ప్రకాష్ రాజ్ ప్రసంగించిన వేదికను గోమూత్రంతో శుద్ధిచేసి సంచలనం రేపాయి. తాజాగా, ఆ శుద్ధి కార్యక్రమంపై ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో స్పందించారు.
రాజ్యాంగం నుంచి `సెక్కులర్` అనే పదాన్ని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేస్తామని హెగ్డే వ్యాఖ్యానించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్....హెగ్డే వ్యాఖ్యలను ఖండించారు. దీంతో, ప్రకాష్ రాజ్ పై తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆ ప్రాంగణాన్ని బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు గోమూత్రంతో శుద్ధి చేశారు. పవిత్ర స్థలమైన రాఘవేంద్ర మఠాన్ని కొందరు సోకాల్డ్ మేధావులు అపవిత్రం చేసినందుకే గోమూత్రంతో శుద్ధి చేశామని బీజేపీ యువ మోర్చా నేత విశాల్ మరాటె అన్నారు. ఆ మేధావులను సమాజం క్షమించదన్నారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ స్పందించారు. తాను ఎక్కడికెళ్లినా గోమూత్రంతో శుద్ధి చేస్తారా..? అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, కానీ, పదేపదే సవాల్ చేసి తనను రెచ్చగొడితే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమేనన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందనపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.