పవన్ లోగుట్టు...జయసుధ రట్టు చేశారుగా

Update: 2019-04-09 14:07 GMT
ఎన్నికల ప్రచారం ముగిసిసోయింది. రేపంతా సాగితే... ఎల్లుండి ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఆ రోజు సాయంత్రానికి ప్రల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. ఎన్నికల ప్రచారం  మొదలైన నాటి నుంచి ప్రచారం ముగిసే దాకా అధికార పార్టీ టీడీపీపై పల్లెత్తు మాట అనని జనసేన అధినేత పవన్ కల్యాణ్... అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ పవన్ కల్యాణ్ విపక్షం వైసీపీపై నిప్పులు చెరుగుతూ సాగారు. ఎక్కడైనా అధికార పార్టీపై విపక్షాలు దండెత్తడం చూశాం గానీ... అధికార పార్టీపై పోరాటం సాగిస్తున్నామని చెబుతూనే... విపక్షంపై విమర్శలు సంధించడం ఏపీలో ప్రత్యేకించి ఇప్పటి ఎన్నికల్లో మాత్రమే చూస్తున్నాం. అయినా ఈ తరహా పవన్ వైఖరికి గల కారణమేమిటన్న కోణంలో అన్ని వర్గాలు ఆలోచించి ఓ అంచనాకు వచ్చాయి.

అయితే ఆ మాటను బయటకు చెప్పేందుకు చాలా మంది తటపటాయిస్తే... పవన్ కల్యాణ్ మాదిరే సినిమాల్లో రాణించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సీనియర్ నటి - వైసీపీ నేత జయసుధ... పవన్ ను నేరుగానే టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో సినీ తారలంతా వరుస కట్టి మరీ వైసీపీలో చేరిపోతున్నారు. అసలు టీడీపీ వైపు చూస్తున్న సినీ తార కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కాస్తంత అసహనానికి గురైన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... పనిలేకనే సినిమా వాళ్లు వైసీపీలో చేరుతున్నారని నోరు జారారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జయసుద... మరి పవన్ కల్యాణ్ సినిమాల్లో నుంచి కాకుండా ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానాలు నచ్చిన కారణంగానే తామంతా వైసీపీలో చేరామని, ఈ మాత్రం దానికి తమకు పనిలేదంటూ వ్యాఖ్యలు చేయడమేంటని బాబును కడిగిపారేశారు. ఇప్పటికీ తాము సినిమాల్లో బిజీగానే ఉన్నామన్న విషయాన్ని కూడా తమపై విమర్శలు గుప్పించేవారు గుర్తించాలని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

ఇక పవన్ కల్యాన్ వ్యవహార సరళిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జయసుద... చంద్రబాబు చిత్ర పరిశ్రమకి సంబంధించిన వాళ్ళని అంటూ ఉంటే పవన్ కళ్యాణ్ అంత సైలెంట్ గా ఎందుకు ఉన్నాడో అర్థంకాలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా సినిమా వాళ్లపై విమర్శలపై స్పందించని పవన్ వైఖరి వెనుక ఓ కారణం ఉందని కూడా చెప్పిన జయసుధ.. టీడీపీతో జనసేన సీక్రెట్ గా కలిసి పనిచేస్తాం అని ఒప్పదం కుదుర్చుకోవటం వల్లనే పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడటం లేదు అని చెప్పారు జయసుధ. ఇలాంటి చీకటి ఒప్పందాలు కుదుర్చుకోవడంలో బాబుతో పాటు పవన్ కూడా ఆరితేరారని కూడా జయసుధ సెటైర్లు సంధించారు. ఈ తరహా చీకటి పొత్తులపై జనం తమదైన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమేనని కూడా జయసుధ సంచలన కామెంట్ చేశారు.

  


Tags:    

Similar News