చిరాకు తెప్పించే రికార్డుకు చేరువైన అదానీ

Update: 2021-06-18 06:30 GMT
స్వల్ప వ్యవధిలో తిరుగులేని రీతిలో దూసుకెళుతున్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. విదేశీ మీడియాలో వచ్చిన వార్తతో పాటు..స్వదేశంలో చోటు చేసుకున్న పరిణామాలతో అదానీ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోవటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వారానికి ముందు ఆసియాలో అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంపదకు దగ్గరగా వచ్చిన అదానీ.. వారం తిరిగేసరికి ఆయన పరిస్థితి అయ్యో అనుకునేలా చేసిందని చెబుతున్నారు.
కేవలం వారం వ్యవధిలో ఇంత దారుణంగా సంపదను పోగొట్టుకున్న వ్యక్తుల్లో ప్రపంచంలోనే అదానీ మొదటి స్థానంలో నిలుస్తారని చెబుతున్నారు. అదానీ గ్రూప్ నకు చెందిన ఆరు కంపెనీల్లో మూడు విదేశీ పోర్ట్ ఫోలియో సంస్థ ఖాతాల్ని ఎస్ఎస్ డీఎల్ స్తంభింపచేసిందన్న వార్తతో ఈ కంపెనీల షేర్ల విలువ గణనీయంగా తగ్గిపోవటం తెలిసిందే.

వారం వ్యవధిలో అత్యధిక సంపదన పోగొట్టుకున్న పారిశ్రామికవేత్తగా అదానీ నిలిచారు. మూడు రోజుల్లో ఆయన సంపద రూ.67వేల కోట్లు కరిగిపోయింది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ఆయన వ్యక్తిగత సంపద దాదాపు 9 బిలియన్ డాలర్లు తగ్గిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ నెల ప్రారంభంలో అదానీ సంపద విలువ 80 బిలియన్ డాలర్లు కాగా.. వారం వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన ఆస్తి 67.6 బిలియన్ డాలర్లకు కరిగిపోయింది. అంటే 12.4బిలియన్ డాలర్లు (91.8వేల కోట్లు) మేర ఆయన ఆస్తులు తగ్గాయి.

ఆయన ఆస్తుల విలువ తగ్గటంలో అదానీ పోర్ట్స్  షేర్ 23 శాతం తగ్గితే.. అదానీ పవర్, అదానీ టోటల్, అదానీ ట్రాన్స్ మిషన్ 18 శాతానికి తగ్గింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 15 శాతానికి పడింది. మొన్నటివరకు తిరుగులేని వ్యక్తిగా నిలిచిన అదానీ.. ఇప్పుడు అత్యంత దురదృష్టవంతుడిగా అభివర్ణిస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆయనకు ఢోకా లేదనే విశ్లేషణలు తాజా పరిణామాలతో తప్పుగా తేలిపోయాయని చెప్పాలి.


Tags:    

Similar News