అదానీ ఖాతాలోకి కృష్ణ‌ప‌ట్నం పోర్టు!

Update: 2021-04-05 15:03 GMT
గుజ‌రాత్‌ కు చెందిన కార్పొరేట్ దిగ్గ‌జం అదానీ గ్రూప్‌ ఖాతాలోకి ఏపీకి చెందిన మ‌రో సంస్థ వెళ్లిపోయింది. కొన్ని వారాల కింద‌ట విశాఖ‌లోని గంగ‌వ‌రం పోర్టులో మెజారిటీ వాటాల‌ను ద‌క్కించుకున్న అదానీ.. ఇప్పుడు కృష్ణ‌ప‌ట్నం పోర్టును లిమిటెడ్‌ను పూర్తిగా త‌న ఖాతాలో వేసుకుంది.  సోమ‌వారం నాటి అధికారిక ప్ర‌క‌ట‌న మేర‌కు.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ లిమిటెడ్‌(ఏపీఎస్ ఈజెడ్‌), భారత్‌లో అతి ప‌ద్ద ప్రైవేటు పోర్టులు, లాజిస్టిక్స్ కంపెనీ అయిన అదానీ గ్రూప్ కృష్ణ‌ప‌ట్నం పోర్టులో 100 శాతం వాటాను సొంతం చేసుకుంది.

ఏపీ ఎస్ ఈ జెడ్ కు ఇప్ప‌టికే 75 శాతం వాటా ఉంది. అయితే.. తాజాగా విశ్వ స‌ముద్ర హోల్డింగ్స్ కు చెందిన 28 వేల కోట్ల విలువైన‌ మ‌రో 25 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న 75 శాతం నుంచి 100 శాతం వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకున్న‌ట్టు అయింది. ప్ర‌స్తుతం సేక‌రించిన వాటా విలువ 13,675కోట్లుగా ఉంద‌ని పేర్కొంది.  

ఏపీలోని నెల్లూరు తీర‌ప్రాంతంలో ఉన్న కృష్ణ‌ప‌ట్నం పోర్టు(చెన్నై పోర్ట్స్‌కు 180 కిలో మీట‌ర్ల దూరంలో ఉంది) త‌మిళ‌నాడు, ఏపీ స‌రిహ‌ద్దుల్లో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ పోర్టులో అనేక సౌల‌భ్యాలు ఉన్నాయి. డీప్ వాట‌ర్ పోర్టు స‌హా.. మ‌ల్టీ కార్గో ఫెసిలిటీ కూడా ఉంది. ప్ర‌స్తుతం ఏటా 64 మిలియ‌న్ ట‌న్నుల సామ‌ర్థ్యం క‌లిగి ఉండ‌డం గ‌మ‌నార్హం.

కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు 6800 ఎక‌రాల భూముల‌తో పాటు.. 20 కిలో మీట‌ర్ల స‌ముద్ర తీర ప్రాంతం ఉంది. అదేస‌మ‌యంలో వ‌చ్చే 50 ఏళ్లలో ప్ర‌స్తుతం ఉన్న సామ‌ర్థ్యాన్ని 300 మిలియ‌న్ ట‌న్నుల‌కు పెంచాల‌నే ల‌క్ష్యం కూడా ఉంది.  ప్ర‌స్తుత ఏడాదిలో 38 మిటియ‌న్ ట‌న్నుల ఎగుమ‌తుల‌తోపాటు.. రూ.1840 కోట్ల మేర ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా ఉంది.  కృష్ణ‌ప‌ట్నం పోర్టులో ప‌నులు ప్రారంభించిన త‌ర్వాత‌.. 2020లో 57శాతంగా ఉన్న ఉత్ప‌త్తి, వినిమ‌యం, ఎగుమ‌తులు వంటివి రీ-ఇంజ‌నీరింగ్‌, వ్యాపార అభివృద్ధి వంటి కార‌నంగా.. 2021లో 72 శాతానికి పెరిగింది.  

ఏపీఎస్ ఈ జెడ్‌.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్.. పూర్తిస్థాయి డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ అదానీ మాట్లాడుతూ.. కృష్ణ‌ప‌ట్నం పోర్టును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని.. ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇటు ఏపీ, అటు క‌ర్ణాట‌క‌ల‌కు త‌ల‌మానికంగా దీనిని తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు. దీనిని త‌యారీ, పారిశ్రామిక కేంద్రంగా మార్చుకుంటామ‌ని.. పోర్టుకు ఉన్న భూముల‌ను స‌ద్వినియోగం చేసుకుంటామ‌ని వివ‌రించారు.  


Tags:    

Similar News