ఈ ఆదిలక్ష్మితోనే అదంతా మొదలైంది

Update: 2015-10-21 04:04 GMT
‘‘కొమ్మినేని ఆదిలక్ష్మి’’ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా తక్కువమందికి తెలిసే అవకాశం ఉంది. ఆ మాటకు వస్తే.. ఆమె నివసించే జిల్లా వారికి కూడా ఆమె పెద్ద పరిచయస్తురాలు కాదు. కానీ.. ఆమె తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఓ పెద్ద స్ఫూర్తిగా మారటమేకాదు.. ఏపీ రాజధాని నిర్మాణం త్వరగా మొదలు కావటానికి కారణంగా మారారని చెప్పొచ్చు.

దాదాపు 33వేల ఎకరాల్ని ఏపీ రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు సర్కారు సమీకరించిన విషయం తెలిసిందే. ఎంత పెద్ద పని అయినా మొదటి అడుగుతోనే ఇది మొదలవుతుంది. ఏపీ రాజధానికి అవసరమైన భూమిని సేకరించేందుకు అమరావతి ప్రాంతంలోని ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారన్న అనుమానాల్ని ‘‘ఆది’’లోనే తుంచేస్తూ.. ఈ ‘‘ఆదిలక్షమ్మ’’ తీసుకున్న నిర్ణయం భారీఎత్తున రైతులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చేలా చేసింది.

తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే.. ఆ ప్రాంతానికి చెందిన రైతుల్లో కొమ్మినేని ఆదిలక్ష్మి మొదటగా ముందుకొచ్చారు. తమకున్న భూమిని ఏపీ ప్రభుత్వానికి ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆదిలక్ష్మి ఉండేది తుళ్లూరులో అయినా.. ఆమెకున్న భూమి మాత్రం నేలపాడులో. తన కుటుంబ సభ్యులతో చర్చించి.. వారిని ఒప్పించి.. తమ వ్యవసాయ భూమిని ఏపీ సర్కారుకు అందజేయాలన్న నిర్ణయాన్ని మొదటగా తీసుకున్నది ఆదిలక్ష్మే. ఆమె నిర్ణయం మిగలిన రైతుల్లో కొత్త ఆలోచనల్ని తీసుకురావటమే కాదు.. రాజధానికి అవసరమైన భూమిని ఇచ్చేలా పురిగొల్పిందని చెప్పొచ్చు. తన భూమిని ఏపీ రాజధాని కోసం ఇవ్వాలన్న నిర్ణయాన్ని అధికారులకు చెప్పేందుకు వెళ్లిన ఆమె.. నాటి పరిస్థితుల్ని చెప్పుకొస్తూ.. తాను వెళ్లేసరికి అధికారులు మాత్రమే ఉన్నారని.. రైతులు ఎవరూ లేరని.. తన నిర్ణయాన్ని అధికారులకు చెబితే వారు సంతోషించి.. భూమి పత్రాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలు ఇమ్మన్నారని.. అలా తాను తెచ్చి ఇచ్చినట్లుగా గతాన్ని గుర్తు చేసుకుంటారు.

ఈ ఆదిలక్ష్మి తీసుకున్న నిర్ణయం ఒక ఉద్యమంగా మారి.. రాజధానికి అవసరమైన భూమిని ఏపీ సర్కారు తీసుకునేలా చేయటంతో పాటు.. పెద్ద ఎత్తున నిరసనలు.. రక్తపాతాలు లాంటివేమీ చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో (కొన్ని కొన్ని గ్రామాల్లో ఆందోళనలు చోటు చేసుకున్నప్పటికీ) భూసేకరణ కార్యక్రమం పూర్తి అయ్యిందని చెప్పొచ్చు. అందుకే.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా కొమ్మినేని ఆదిలక్ష్మిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమరావతి చరిత్రలో ఆమె పేరు తప్పనిసరి. ఆమెతోనే అమరావతి ప్రయాణం మొదలైందన్న విషయం మర్చిపోకూడదు.
Tags:    

Similar News