ఈసారి పులివెందుల కాదా.. అందుకేనా సవాల్...?

Update: 2022-08-08 23:30 GMT
వైఎస్సార్ ఫ్యామిలీకి పులివెందుల సీటు పెర్మనెంట్ సీటుగా చెప్పాలి. 1978లో ఎపుడైతే వైఎస్సార్ తొలిసారి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారో నాటి నుంచి ఆ ఫ్యామిలీకి చెందిన వారే  ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా నెగ్గుతూ వస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీలోనే చూస్తే వైఎస్సార్ తో పాటు చిన్నాన్న వివేకా, అమ్మ విజయమ్మ, జగన్ ఇలా అంతా ఎమ్మెల్యేలు అయ్యారు. వైఎస్సార్, జగన్ అయితే పులివెందుల నుంచి గెలిచి ముఖ్యమంత్రులు అయ్యారు.

కానీ ఇపుడు చూస్తే సీన్ మారుతోందా అనిపిస్తోంది. ఇప్పటికి రెండు సార్లు పులివెందుల నుంచి గెలిచిన జగన్ 2024లో సీటు మారుస్తారు అని చాలా కాలంగా ప్రచారం లో ఉన్న విషయమే. అయితే ఆయన జిల్లా విడిచి వెళ్లడంలేదు. పులివెందుల పక్కనే ఉన్న జమ్మలమడుగు నుంచి ఈసారి నిలబడి ఓట్లడుగుతారు అని అంటున్నారు. జమ్మలమడుగులో కూడా వైసీపీకి గట్టి పట్టుంది.

ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుని కుమారుడు. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేసి బంబర్ విక్టరీ కొట్టారు. 2014లో వైసీపీ మీద గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు. ఇపుడు ఆయన బీజేపీలో ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆదినారాయణరెడ్డి నేరుగా జగన్ కే ఒక సవాల్ చేశారు. జమ్మలమడుగు నుంచి జగన్ పోటీ చేస్తే తాను ప్రత్యర్ధిగా నిలబడి ఓడిస్తాను అన్నదే ఆ సవాల్. నిజంగా ఇది ఆస్కతికరమైన సవాల్ గానే చూడాలి. జగనేంటి జమ్మలమడుగులో పోటీ ఏంటి అని కూడా అంతా ఆశ్చర్యపోవచ్చు. కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా.

జగన్ జమ్మలమడుగు ఈ రెండింటినీ కలిపి చాలా కాలంగా చర్చ అయితే సాగుతోంది. జగన్ కూడా ఈసారి సీటు మార్చాలనుకుంటున్నారు అని అంటున్నారు. పులివెందుల సీటుని వైఎస్ వివేకా కుమార్తె సునీతకు ఇచ్చి తాను జమ్మలమడుగునకు షిఫ్ట్ అవుతారు అని అంటున్నారు. అయితే జగన్ ఆలోచనలు ముందే పసిగట్టిన ఆదినారాయణరెడ్ది ఈ సవాల్ చేశారని అంటున్నారు.

అయితే జగన్ పోటీ చేస్తే జమ్మలమడుగులో ఓడించడం కష్టమే అంటున్నారు. ఆయనకు అక్కడ మంచి ఆదరణ ఉంది. పైగా వైసీపీ పటిష్టంగా ఉంది. అయితే ఇక్కడ టీడీపీ నుంచి ఆదినారాయణరెడ్డి అన్నయ్య నారాయణరెడ్డి కుమారుడి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఆదినారాయణ బీజేపీలో ఉన్నారు. మరి జగన్ తో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ పడతారు అన్నదే చర్చ. అయితే టీడీపీ బీజేపీ పొత్తులో కలిస్తే బీజేపీ నుంచి ఆదినారాయణ పోటీ చేసి జగన్ తో సై అంటారని తెలుస్తోంది.

ఏది ఏమైనా ఈసారి జగన్ పులివెందుల నుంచి పోటీ చేయరనే అంటున్నారు. దానికి అనేక రాజకీయ సామాజిక  కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. వివేకాకు గట్టి పట్టున్న పులివెందులలో ఆయన  హత్య తరువాత పరిస్థితులు కొంత మారాయని కూడా చెబుతున్నారు. దాంతో ఆయన కుమార్తెను పోటీకి పెట్టి అందరినీ వైసీపీ గూటికి తెచ్చే ప్రయత్నంలో భాగమే  జగన్ జమ్మలమడుగు షిఫ్టింగ్ అని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత ఉందో రానున్న రోజులలో చూడాలి.
Tags:    

Similar News