అక్క‌డ మంత్రి విజ‌యం ఈసారి క‌ష్ట‌మే!

Update: 2018-12-02 07:52 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి జ‌మ్మ‌ల‌మ‌డుగులో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం అంత తేలిక కాదా? ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు అవుననే స‌మాధానం చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో మంత్రిపై చాలా వ్య‌తిరేకత ఉంద‌ని.. ఈ విష‌యం స్వ‌యంగా మంత్రికి కూడా ఇప్ప‌టికే అవ‌గ‌త‌మైంద‌ని వారు సూచిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ త‌రఫున ఆదినారాయ‌ణ రెడ్డి విజ‌యం సాధించారు. స్థానికంగా పేరున్న నేతే అయినా.. అప్ప‌ట్లో జ‌గ‌న్ ఇమేజ్ కూడా ఆదినారాయ‌ణ గెలుపుకు చాలా దోహ‌దం చేసింద‌ని విశ్లేష‌కులు చెబుతుంటారు. అయితే - గెలిచిన వెంట‌నే ఆయ‌న పార్టీ మారారు. అధికార టీడీపీలో చేరారు. మంత్రి ప‌ద‌విని కూడా స్వీక‌రించారు.

పార్టీ ఫిరాయింపు కార‌ణంగా అప్ప‌ట్లోనే ఆదినారాయ‌ణ‌పై చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. టీడీపీలోకి వెళ్లాల‌నుకుంటే.. వైసీపీ త‌ర‌ఫున ద‌క్కించుకున్న ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయాలి క‌దా అని చాలామంది నిల‌దీశారు. ఇప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ఆ అస‌హ‌నం లోలోప‌ల గూడుక‌ట్టుకొని ఉంద‌ట‌. ఇక మంత్రి ప‌ద‌విలో ఉండి కూడా నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిని ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌న్న‌ది ఆదినారాయ‌ణ‌పై ఉన్న మ‌రో ఆరోప‌ణ‌. జ‌మ్మ‌ల‌మ‌డుగు అభివృద్ధికి ప్ర‌భుత్వ అండ అవ‌స‌రం కాబ‌ట్టే ఆయ‌న వైసీపీని వీడి టీడీపీలో చేరామ‌ని తాము తొలుత భావించామ‌ని.. అయితే - త‌మ అంచ‌నాలను ఆదినారాయ‌ణ త‌ల‌కిందులు చేశార‌ని ప‌లువురు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఉంటూ ఆయ‌న‌పైనే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించ‌డం కూడా ఆదినారాయ‌ణ‌కు బాగానే చేటు చేస్తోంద‌ని మ‌రికొంద‌రు చెప్తున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో ఆదినారాయ‌ణ జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి పోటీ చేస్తే ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో సీటు కోసం ప్ర‌య‌త్నించాల్సిందేన‌ని ఆయ‌న‌కు సూచిస్తున్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగులో ప్ర‌స్తుతం వైసీపీ బాగా బ‌లం పుంజుకుంద‌ని వారు చెప్తున్నారు. మ‌రోవైపు - చంద్ర‌బాబు కూడా ఈ దఫా ఎన్నిక‌ల్లో ఆదినారాయ‌ణ‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్ద‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న్ను క‌డ‌ప లోక్‌స‌భ స్థానానికి పోటీ చేయించాల‌నుకుంటున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం అందుతోంది. అయితే - చంద్ర‌బాబు నిర్ణ‌యం బెడిసికొట్టే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక్క‌ జ‌మ్మ‌లమ‌డుగు అసెంబ్లీ సీటులోనే విజ‌యం క‌ష్ట‌మ‌వుతుంద‌నుకుంటుంటే.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌నూ క‌లుపుకొని ఉండే క‌డ‌ప‌ ఎంపీగా ఆయ‌న ఎలా గెల‌వ‌డ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. చూద్దాం మ‌రి ఎన్నిక‌లొచ్చాక ఏం జ‌రుగుతుందో!

Tags:    

Similar News