కొంతకాలంగా వివిధ ఎయిర్ లైన్స్ సంస్థల సిబ్బందికి, సెలబ్రిటీలకు మధ్య వివాదాలు రేగుతోన్న సంగతి తెలిసిందే. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొన్ని సార్లు ఆ వివాదాలు చెలరేగగా....మరి కొన్నిసార్లు కొందరు సెలబ్రిటీల వైఖరి వల్ల గొడవలు జరిగాయి. తాజాగా, ఎయిరిండియా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బాలీవుడ్ అదితి రావ్ హైదరి అసౌకర్యానికి గురైంది. దీంతో, ఎయిరిండియా సిబ్బందిపై ఆమె మండిపడింది. తనతోపాటు తన సహప్రయాణికులకు చెప్పకుండా ఎయిరిండియా సిబ్బంది తమ లగేజీని దించేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిరిండియాపై అసహనం వ్యక్తం చేస్తూ అదితి చేసిన ట్వీట్ వైరల్ అయింది.
మంగళవారం రాత్రి కులు నుంచి చండీగఢ్ వెళ్లాల్సిన ఎయిరిడియా విమానంలో అదితి ప్రయాణించాల్సి ఉంది. అయితే, విమానంలో 15 మంది ప్రయాణికులు ఎక్కగానే ఓవర్ లోడ్ అయ్యిందంటూ ప్రయాణికుల లగేజీని సిబ్బంది దించేశారు. ఆ విషయాన్ని అదితితోపాటు ప్రయాణికులకు చెప్పలేదు. దీంతో, అదితి రావు ...ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ప్రయాణికులకు చెప్పకుండా వారి లగేజీని దించేయడం ఎంత వరకు సబబని ఆమె ట్విట్టర్ లో ప్రశ్నించింది. ఒక్క బ్యాగ్ ను కూడా విమానంలో పెట్టనివ్వలేదని, ఇది ఎయిర్ ఇండియా అసమర్థతకు నిదర్శనమని, నిజంగా ఇది సిగ్గుచేటని ఆమె మండిపడింది. ఈ వ్యవహరంపై సిబ్బందిలో ఏ ఒక్కరు తమకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని, తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదితి ట్వీట్ పై ఎయిరిండియా స్పందించింది. ఆ విమానం వివరాలు తమకు తెలిపాలని, అందుకు కారణమైన వారిపై తగిన చర్యలు చేపడతామని తెలిపింది. అంతేకాకుండా, అదితికి ఎయిరిండియా క్షమాపణలు చెప్పింది.