ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్?

Update: 2020-12-10 09:39 GMT
ఏపీ సీఎస్ నీలం సాహ్ని సమర్థవంతమైన ఐఏఎస్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎస్ గా పనిచేస్తోన్న నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే తనదైన పనితీరుతో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రితో ఎప్పటికపుడు సమీక్షిస్తూ....అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులు చక్కదిద్దారు. ఈ క్రమంలోనే జూన్ 30తో నీలం సాహ్ని పదవీకాలం ముగియాల్సి ఉన్నప్పటికీ....కరోనా నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని కేంద్రం అనుమతితో పొడిగించారు ఏపీ సీఎం జగన్. అయితే, డిసెంబరు 31తో సాహ్ని పదవీకాలం ముగియనుంది. దీంతో, కొత్త సీఎస్ రేసులో పలువురు ఐఏఎస్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు సీఎస్ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఆదిత్యనాథ్ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.


జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ను సీఎస్‌ కార్యాలయంలో ఓఎస్డీగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకూ ఓఎస్డీగా ఆదిత్యనాధ్ ఉంటే పాలనా వ్యవహారాలపై పట్టు పెరుగుతుందని జగన్ భావిస్తున్నారట.వాస్తవానికి నీలం సాహ్ని తర్వాత సీనియార్టీలో ఆమె భర్త అజయ్‌ సాహ్ని, సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్‌ త్రిపాఠి, సతీష్‌ చంద్ర, జేఎస్వీ ప్రసాద్‌, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉన్నారు. అజయ్‌ సాహ్ని, సమీర్‌ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. అభయ్‌ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీభవన్‌లో పనిచేస్తుండగా, సతీష్‌చంద్ర చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. జేఎస్వీ ప్రసాద్‌వైపు జగన్ మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ఇక, నీరబ్‌ కుమార్‌ సీఎస్‌ రేసులో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే, 2024 జూన్‌ వరకూ ఆయన పదవీకాలం ఉండడంతో వేరేవారికి అవకాశం ఇవ్వాలని జగన్ అనుకున్నారట. దీంతో, 2021 జూన్‌లో పదవీ విరమణ చేయనున్న ఆదిత్యనాథ్ వైపు జగన్ మొగ్గుచూపారని తెలుస్తోంది. అదీగాక, గతంలో జగన్ కేసుల విచారణ సమయంలో ఆదిత్యనాధ్ కూడా విచారణ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆదిత్యనాధ్ కు జగన్ ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలుస్తోంది.




Tags:    

Similar News