సీఎం రాజీనామా చేయాలి...మాజీ ఐఏఎస్‌ ల డిమాండ్‌

Update: 2018-12-19 17:02 GMT
సంచ‌లన - వివాదాస్పద విధానాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  మ‌రో అనూహ్య రీతిలో ఇరకాటంలో ప‌డ్డారు. ఏకంగా 80 మంది అధికారులు ఆయ‌న‌పై తిరుగుబాటు జెండా ఎగుర‌వేశారు. బాహాటంగా మతద్వేషాన్ని ప్రచారం చేస్తున్న తన పదవికి రాజీనామా చేయాలని 80 మందికి పైగా మాజీ ఐఏఎస్ - ఐపీఎస్ - ఐఎఫ్‌ ఎస్ అధికారులు డిమాండ్ చేశారు. వారిలో మాజీ జాతీయ భద్రతా సలాహాదారు శివశంకర్ మీనన్ - మాజీ విదేశాంగ కార్యదర్శులు శ్యాంశరణ్ - సుజాతాసింగ్ వంటి పెద్దలున్నారు. బులంద్‌ షహర్ అల్లర్లలో పోలీసు అధికారి సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ ను దారుణంగా చంపేసిన ఘటన ఇటీవలి కాలంలో విద్వేష రాజకీయాలు ఎంత ప్రమాదకరమైన మలుపు తిరిగాయో సూచిస్తున్నాయని వారు ఘాటుగా రాసిన ఓ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

యూపీలో పరిపాలనా మౌలిక సూత్రాలు - రాజ్యాంగ నైతికత - మానవీయమైన సామాజికవర్తన వక్రమార్గం పట్టాయని దుయ్యబట్టారు. మతద్వేషపు ఎజెండాకు సీఎం ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్నారని - రౌడీయిజం - గూండాయిజం గద్దెనెక్కాయని మండిపడ్డారు. పోలీసు అధికారి సుబోధ్‌ కుమార్‌ సింగ్ హత్య మెజారిటీవాద కండబలం ప్రదర్శనకు జరిగిన ప్రయత్నమని, ఆ ప్రాంతపు ముస్లింలకు ఓ సందేశమని మాజీసీనియర్ అధికారులు తమ లేఖలో ఎండగట్టారు. ఎన్నికల సభల్లో తెగమాట్లాడే మన ప్రధాని నరేంద్రమోదీ ఇలాంటి ఘటనలపై రాయిలా మౌనం వహిస్తున్నారని విమర్శలు సంధించారు. మన ప్రధానస్రవంతి రాజకీయాల్లోకి ఇంతగా విద్వేష విషం ఎన్నడూ చొచ్చుకుపోలేదని, ఉన్నతస్థానాల్లో ఉన్నవారి అండదండలతో పథకం ప్రకారం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. చీఫ్ సెక్రెచటరీ - డీజీపీ - హోం సెక్రెటరీ - ఇతర ఉన్నతాధికారులు చట్టపాలనను నిర్భయంంగా అమలు చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత కలిగి ఉన్నారని మరచిపోరాదని గుర్తుచేశారు.


Tags:    

Similar News