బీజేపీకి కష్టకాలం... అద్వానీకీ అనారోగ్యం

Update: 2019-08-14 17:52 GMT
బీజేపీ... ఐదేళ్ల క్రితం నాడు క్లిస్లర్ క్లియర్ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా, సదరు ఫీట్ ను 3 దశాబ్దాల తర్వాత సాధించిన పార్టీగా రికార్డులకెక్కింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి దుస్సాధ్యంగా మారిన క్లియర్ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ... ప్రధాని పీఠాన్ని అధిష్టించి ప్రపంచ దేశాల చేత ప్రశంసలు అందుకున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లోనూ మరింత బంపర్ మెజారిటీతో మోదీ వరుసగా రెండో పర్యాయం బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. మొత్తంగా ఈ సందర్భంగా బీజేపీలో ఉత్సాహం ఉరకలెత్తుతుండాలి. ఆ ఉత్సాహం ఉరకలు మొదలైనంతనే బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఓ కీలక నేత మరణిస్తే... మరో కీలక నేత ఆసుపత్రిలో చేరడం పార్టీ శ్రేణులను మరింత ఆందోళనకు గురి చేసిందని చెప్పాలి. తాజాగా పార్టీ సీనియర్ నేత, ఇప్పుడు బీజేపీ ఇంతగా ఎదగడానికి ప్రధాన కారకుడైన లాల్ కృష్ణ అద్వానీ మంచం పట్టారు.

వరుసగా బీజేపీ నేతలు అనారోగ్యం బారిన పడుతున్న వైనం ఆ పార్టీని నిజంగానే కలవరానికి గురి చేస్తోంది. మొన్నటికి మొన్న పార్టీలో కీలక నేతగా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్  హఠాత్తుగా కన్నుముశారు. సుష్మా మరణంతో మోదీ అంతటి ధైర్యస్థుడు కూడా కన్నీటిపర్యంతమైన తీరు నిజంగానే బీజేపీని ఎంతగా కలవరపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే... పార్టీకి చెందిన మరో కీలక నేత అరుణ్ జైట్లీ ఉన్నపళంగా ఆసుపత్రి పాలయ్యారు. ఎన్నికలకు ముందే తీవ్ర అనారోగ్యానికి గురైన జైట్లీ వైద్య చికిత్సలు, ఆపరేషన్ తర్వాత కాస్తంత కోలుకున్నట్లే కనిపించింది. అయితే సుష్మా మరణం వెంటనే జైట్లీ ఆరోగ్యం విషమించడం, హుటాహుటీన ఆయనను ఎయిమ్స్ కు తరలించడం బీజేపీలో కలకలమే రేపింది.

ఈ రెండు ఘటనల నుంచి బీజేపీ తేరుకోకముందే... ఆ పార్టీ వృద్ధ నేత ఎల్కే అద్వానీ కూడా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఐదు రోజుల క్రితం వైరల్ ఫీవర్ సోకిన అద్వానీ ఇంటి నుంచి బయటకు రావడమే లేదు. దాదాపుగా బెడ్ కే పరిమితమైన అద్వానీ... రేపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కూడా దూరంగా ఉండక తప్పడం లేదు. ఏటా ఇండిపెండెన్స్ డే నాడు తన ఇంటి ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసే అద్వానీ... అనారోగ్యం కారణంగా ఈ ఏడాది దానిని మానుకోవాల్సి వచ్చింది. ఐదు రోజులుగా జ్వరం బారిన అద్వానీ ఇంకా కోలుకోలేని వైనం నిజంగానే బీజేపీ నేతలను కలవరపెట్టేదే.

    

Tags:    

Similar News