అయ్య‌ప్ప‌స్వామి త‌ర‌ఫు వాదించిన లాయ‌ర్ అద‌ర‌గొట్టాడు

Update: 2018-08-02 05:00 GMT
తండ్రి పైన విశ్వాసం ఉన్న వాడు.. ఆయ‌న‌పై వ్యాజ్యం వేస్తాడా?  భార్య మీద విశ్వాసం ఉన్న భ‌ర్త‌.. ఆమెతో కొన్ని ఇబ్బందులు ఉన్నా.. వాటిని భ‌రిస్తాడే కానీ.. ఆ ఇబ్బందుల లెక్క తేల్చాలంటూ కోర్టుకు ఎక్క‌డు క‌దా? ఒక దేవుడిపై ఇష్టం.. అభిమానం.. ప్రేమ ఉంటే.. ఆయ‌న గీసిన‌ట్లుగా చెప్పే న‌మ్మ‌కాల‌కు విలువ ఇస్తారుగా?  అందునా.. ప‌రిమితుల వెనుక లాజిక్ స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా.. అడ్డ‌గోలు వాద‌న‌లు తెర మీద‌కు తెచ్చి ఏదేదో చేయాల‌నుకోవ‌టంలో అస‌లు ఉద్దేశం ఏమిట‌న్న సందేహం రాక మాన‌దు.

ఇదంతా దేని గురించి అంటారా?. ఇంకెవ‌రూ.. కేర‌ళ కొండ‌ల్లో కొలువు తీరిన‌ట్లుగా కోట్లాది మంది భ‌క్తుల న‌మ్మ‌క‌మైన అయ్య‌ప్ప‌స్వామి గురించి. ఆ స్వామి ద‌ర్శ‌నంపై మ‌హిళ‌ల‌కు కొన్ని ప‌రిమితులు ఉండ‌టం తెలిసిందే. ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌కు.. రుతుక్ర‌మం ఆగిన యాభై ఏళ్ల‌పై మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ఆల‌య ప్ర‌వేశం ఉంద‌న్న‌ది తెలిసిందే.

దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. సుప్రీంకోర్టు మెట్ల‌ను ఎక్కిన కొంద‌రు.. త‌మ వాద‌న‌ను వినిపించ‌టం తెలిసిందే.

కోట్లాదిమంది మ‌నోభావాల‌కు సంబంధించిన అంశంపై స‌మ‌ర్థ‌వంతంగా వాద‌న‌లు వినిపించేవాడు లేడా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. దేవుడి హ‌క్కుల గురించి వాదించే లాయ‌ర్ ఒక‌రు తెర మీద‌కు వ‌చ్చారు.

హైద‌రాబాద్‌కు చెందిన న్యాయ‌వాది జె.సాయి దీప‌క్ అయ్య‌ప్ప స్వామి త‌ర‌ఫున వాదిస్తూ.. తాను దేవుడి త‌ర‌ఫు లాయ‌ర్ న‌ని ప్ర‌క‌టించుకొనట‌మే కాదు.. త‌న వాద‌న‌తో సుప్రీం ధ‌ర్మాస‌నం మ‌న‌సును దోచుకున్నాడు. ఆయ‌న వాద‌న‌ల్ని విన్న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా స్పందిస్తూ.. ఆయ‌న వాద‌న‌లో వాక్ప‌టిమ‌.. లాజిక్ రెండూ ఉన్నాయ‌ని పేర్కొంటే.. మ‌రో న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రోహింగ్ట‌న్ ఫాలీ నారీమ‌న్ సైతం జ్ఞానబోధకంగా ఉంద‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి  ఎలాంటి ప‌రిమితులు లేకుండా అంద‌రు మ‌హిళ‌ల్ని అనుమ‌తించాల‌న్న పిటీష‌న్ పై త‌న వాద‌న‌ను వినిపించే ప్ర‌య‌త్నం చేశారు. పీపుల్ ఫ‌ర్ ధ‌ర్మ త‌ర‌ఫున వాదించిన సాయి దీప‌క్ కు తొలుత సుప్రీం ధ‌ర్మాస‌నం ప‌ది నిమిషాల స‌మ‌యాన్ని మాత్ర‌మే ఇచ్చింది.

త‌న‌కు ఇచ్చిన త‌క్కువ స‌మ‌యంలోనే ప‌లు మౌలిక ప్ర‌శ్న‌ల్ని సంధించారు. దీంతో.. ఆయ‌న వాద‌న‌ల్ని వినేందుకు లంచ్ త‌ర్వాత మ‌రింత టైమిచ్చారు. త‌న బ‌ల‌మైన వాద‌న‌తో రెండు గంట‌ల పాటు వాదించిన సాయి దీప‌క్ వాద‌న హైలెట్ గా మార‌ట‌మే కాదు.. దేవుడి త‌ర‌ఫున‌.. ఆయ‌న‌కు సైతం హ‌క్కులు ఉంటాయ‌న్న విష‌యాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేయ‌గ‌లిగారు.

సాయి దీప‌క్ వాద‌న‌ల్లో ముఖ్యాంశాల్ని చూస్తే..

+ రాజ్యాంగంలోని 21, 25, 26 నిబంధనల కింద అయ్యప్ప హక్కులు ఇందులో ఇమిడి ఉన్నాయి. నైష్ఠిక బ్రహ్మచారిగా ఉండే హక్కును రాజ్యాంగంలోని 25వ నిబంధన కింద గుర్తించాలి.  మహిళల ప్రవేశాన్ని నియంత్రించాలి. దేవుడిని రక్త మాంసాలున్న మనిషిలా, రాజ్యాంగ హక్కులున్న న్యాయబద్ధమైన వ్యక్తిగా గుర్తిస్తూ ఎవరూ వాదనలు వినిపించలేదు. నాకు ఆ అవ‌కాశాన్ని ధర్మాసనం ఇవ్వాలి.

+ దేవుడిని న్యాయబద్ధమైన వ్యక్తిగా గతంలోనే సుప్రీంకోర్టు గుర్తించింది. ఆర్టికల్‌ 21 కింద ఆలయం యజమాని అయిన దేవుడికి తన ఇంట్లో ప్రైవసీ హక్కు ఉంటారు. నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవడం అందులో భాగమే. భగవదేచ్ఛనే సంప్రదాయాల రూపంలో ఆలయం పరిరక్షిస్తోంది.

+ ఆర్టికల్‌ 25(1) కింద వ్యక్తులకు తమ ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ ఉన్నట్లే దేవుడికి కూడా తన ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ ఉంది. దేవుడి విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. పిటిషనర్ల హక్కుల కోసం దేవుడి హక్కులను హరించడం కుదరదు. పిటిషనర్ల హక్కులు దేవుడి హక్కులకు లోబడి ఉండాలి.

+ + వందల మందిని చంపిన ఉగ్రవాదికి న్యాయ సహాయాన్ని అందిస్తున్నపుడు, అలాంటి వారికి మరణశిక్ష అమలుపై అర్ధరాత్రి విచారణ చేపడుతున్నపుడు దేవుడికి అన్యాయం జరుగుతున్నపుడు ఆయన తరఫున వచ్చి వాదించడం సమంజసమే.

+ 13 ఏళ్ల బాలుడిగా నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నా. ఆయన భక్తుడిని కాకపోయినా ఆయన తరఫున వాదించి ఉండేవాడిని. స్వామి ద‌ర్శ‌నాన్ని లింగ వివక్ష కోణంలో చూడటం సరికాదు. మహిళల ప్రవేశంపై నియంత్రణను హాస్యాస్పద రూల్ గా భావిస్తున్న వారికి నిజానికి ఆ దేవుడి మీద భక్తి ఉందా? అన్నది అస‌లు ప్రశ్న.

సాయి దీప‌క్ వాద‌న‌లు కోర్టు ముగిసే వ‌ర‌కూ సాగాయి. కేసుకు సంబంధించి ఉభ‌య‌ప‌క్షాల న్యాయ‌వాదులు ఇంకేమైనా చెప్పాల‌నుకుంటే త‌మ వాద‌న‌ల్ని సంక్షిప్త‌గా ఏడు రోజుల్లో త‌మ‌కు స‌మ‌ర్పించాల‌ని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తీర్పును వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.


Tags:    

Similar News