అఫ్గానిస్థాన్ క్రికెట్‌.. అయ్యో పాపం

Update: 2021-09-23 04:34 GMT
అఫ్గానిస్థాన్.. క్రికెట్లో చాలా వేగంగా ఎదుగుతున్న దేశం. తమ దగ్గర క్రికెట్ ఆడటానికి సరైన వసతులు లేకున్నా, స్టేడియాలు అందుబాటులో లేకున్నా, దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి కల్లోల పరిస్థితులు నెలకొన్నా.. వీటన్నింటినీ అధిగమించి ప్రపంచ స్థాయిలో వడి వడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగిందా జట్టు. రషీద్ ఖాన్, మహ్మద్ నబి, ముజీబుర్ రెహ్మాన్ లాంటి ప్రతిభావంతులు ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా ఎదిగారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో ఎంత బాగా ఆడుతూ మన క్రికెట్ ప్రేమికుల మనసులు దోచాడో తెలిసిందే. ఐతే ఇటీవల అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతికి చిక్కడంతో ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయింది. తాలిబన్ల రాజ్యం రాగానే అఫ్గానిస్థాన్ ఆడాల్సిన సిరీస్‌ ఒకటి రద్దయింది. ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మారిపోయాడు. తాజాగా తాలిబన్ల నేతృత్వంలోని ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది.

ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మహిళా ప్రేక్షకులు కనిపించడమే.. ఈ నిషేధానికి కారణం కావడం గమనార్హం. తాలిబన్ల నిబంధనల ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు. తిరిగినా వాళ్లు ముఖం, జుట్టు బయటికి కనిపించేలా ఉంచకూడదు. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మహిళలు బురఖాలు ధరించి కనిపించరు కాబట్టి ఆ దృశ్యాలను చూడటం తప్పు. అందుకే అఫ్గానిస్థాన్లో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించారు. ఓవైపు రషీద్ ఖాన్ చక్కటి ప్రదర్శన చేస్తుంటే స్వదేశంలో అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు అతడి ఆట చూడలేకపోవడం ఎంత బాధాకరం. బుధవారం ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడినా.. రషీద్ బ్యాటుతో, బంతితో రాణించాడు. కానీ అతడి ప్రదర్శనను అఫ్గానీయులు చూడలేకపోయారు. ఇక ముందూ చూడలేరు.

 ఇదిలా ఉండగా.. అఫ్గానిస్థాన్ క్రికెట్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ఐసీసీ ఆ దేశ జట్టును అంతర్జాతీయ టోర్నీలకు అనుమతించే విషయంలో పునరాలోచిస్తోందని.. అలాగే వేర్వేరు దేశాల్లో ఉన్న ఆ దేశ క్రికెటర్లు జట్టుగా కలవడంపై సందేహాలు నెలకొన్నాయని.. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ జట్టు పాల్గొనడం డౌటే అని వార్తలొస్తుండటం గమనార్హం.
Tags:    

Similar News