పదేళ్ల తర్వాత ఆ అవకాశం లభించింది జస్టిస్ చంద్రచూడ్ కే!

Update: 2022-11-09 15:30 GMT
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేతి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయన తండ్రి యశ్వంత్ చంద్రచూడ్ కూడా గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

ఇలా తండ్రి కొడుకులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించిన అరుదైన రికార్డు వారికి మాత్రమే సొంతమని చెప్పాలి. జస్టిస్ చంద్రచూడ్ స్వతంత్య్ర భారతంలో ఈ పదవిని చేపట్టిన యాభయ్యో వ్యక్తిగా నిలవనున్నారు. ఇదొక విశేషం అయితే.. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన వారు ఇలా వచ్చి.. అలా పదవీకాలం పూర్తి చేసుకున్న వారే. కాస్తంత ఎక్కువ కాలం ఆ పదవిలో ఉన్న వారు తక్కువగా కనిపిస్తారు.

అలాంటిది జస్టిస్ చంద్రచూడ్ మాత్రం ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇంత కాలం ఈ పదవిలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎంత కాలం క్రితం ఉన్నారన్న విషయాన్ని చూస్తే.. దాదాపు పదేళ్ల క్రితమన్నది అర్థమవుతుంది. 2010 మే 12న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సరోష్ హోమి కపాడియా ఈ పదవిలో 2 సంవత్సరాల 139 రోజులు ఉన్నారు. ఆయనకు ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ కె. గోపీనాథన్ బాలక్రిష్ణన్ ఏకంగా 3 సంవత్సరాల 117 రోజులు పదవిలో ఉన్నారు. వీరి తర్వాత మల్లీ రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కావటం గమనార్హం.

తెలుగువాడు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ.. ఆ పదవికి కొత్త కళను తీసుకొచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ సైతం ఏడాది 124 రోజులు మాత్రమే సీజేఐగా వ్యవహరించారు. ఇప్పటివరకు 50 మంది ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపడితే.. అత్యధిక కాలం పదవీ బాధ్యతల్ని నిర్వహించిన రికార్డు మాత్రం జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ అని చెప్పాలి. దేశ పదహారో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన ఆయన ఏకంగా ఏడు సంవత్సరాల 139 రోజుల పాటు ఆ పదవిలో ఉన్నారు.

ఇక.. అతి తక్కువ కాలం ఈ పదవిలో ఉన్న ప్రధాన న్యాయమూర్తిగా దేశానికి ఇరవైరెండవ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన కమల్ నారియన్ సింగ్ గా చెప్పాలి. ఆయన కేవలం 17 రోజులు మాత్రమే ఈ పదవిలో ఉన్నారు. పదవి చేపట్టిన అతి స్వల్ప కాలానికే ఆయన పదవీ విరమణ కాలం వచ్చేసింది.

ఇప్పటివరకు దేశానికి 50 మంది ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించగా.. వీరిలో రెండేళ్ల పాటు పదవీ బాధ్యతల్ని చేపట్టిన వారు కేవలం పద్నాలుగు మంది మాత్రమే కావటం గమనార్హం. తాజాగా సీజేగా పదవీ బాధ్యతలు చేపట్టిన యశ్వంత్ చంద్రచూడ్ తండ్రి యశ్వంత్ చంద్రచూడ్ అత్యధిక కాలం ఈ పదవిలో ఉన్న వ్యక్తిగా నిలవటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News