సౌదీకి మించి మోడీకి భారీ బహుమతి ఇచ్చిన బహ్రెయిన్

Update: 2019-08-25 11:54 GMT
స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటిన తర్వాత కూడా.. మనకు సమీపంలో ఉన్న కొన్ని దేశాలకు భారత ప్రధానమంత్రులు వెళ్లని వైనం ఉందా? అంటే ఉందనే చెప్పాలి. చాలా దేశాలకు ఇప్పటివరకూ మన దేశ ప్రధానులు ముఖం కూడా చూడని పరిస్థితి. కశ్మీర్ పై సంచలన నిర్ణయాలు వరుస పెట్టి తీసుకున్న మోడీ.. తాజాగా పలు గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

కశ్మీర్ పై అంతర్జాతీయంగా భారత్ ను బద్నాం చేసే కార్యక్రమం మొదలెట్టిన దాయాదికి దౌత్యంతో ఇప్పటికే షాకులు ఇచ్చిన మోడీ.. తాజాగా ముస్లిం దేశాల్లో పర్యటిస్తుండటం గమనార్హం. మోడీ పర్యటన సందర్భంగా ఆయా ముస్లిం దేశాలు ఊహించనిరీతిలో సత్కరించటం.. బహుమానాలు అందిస్తూ.. మోడీకి తామిస్తున్న ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి.

నిన్నటికి నిన్న యూఏఈలో పర్యటించిన మోడీకి.. ఆ దేశ వెళ్లిన మోడీకి యూఏఈ యువరాజు మహ్మద్ బిన్ జామోద్ అల్ నాహ్యాన్.. ఆ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయెద్ తో సత్కరించటం తెలిసిందే. చాలా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న మోడీ తాజాగా బహ్రయిన్ లో పర్యటిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమంటే.. ఆ దేశానికి వెళ్లిన మొట్టమొదటి భారత ప్రధాని మోడీనే కావటం విశేషం.

తమ దేశంలో పర్యటిస్తున్న మోడీకి బహుమానంగా ఆ దేశ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 250 మంది భారతీయుల్ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పథంతో ఆ దేశం తీసుకున్న నిర్ణయానికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. తమ దేశానికి మోడీ పర్యటనకు వచ్చిన సందర్భంగా తమ జైళ్లలో ఉన్న భారతీయుల్లో 250 మందిని విడుదల చేస్తున్నట్లుగా ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసా వెల్లడించారు. ఒకటి తర్వాత ఒకటిగా మోడీ పర్యటిస్తున్న ముస్లిం దేశాల్లో ఆయనకు లభిస్తున్న గౌరవాభిమానాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News