ట్రంప్ సంతకం తర్వాత టెక్సాస్ లో అలా..?

Update: 2017-01-29 05:25 GMT
ముస్లింలను అమెరికాలోకి అనుమతి ఇచ్చేవిషయంలో సంచలన నిర్ణయాన్ని తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమా అని.. యావత్ ప్రపంచం ఇప్పుడు షాక్ కు గురైన పరిస్థితి. ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశం మతం ప్రాతిపదికన ఒక నిర్ణయాన్ని తీసుకోవటంపై పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వలసల్ని నిషేధిస్తూ ట్రంప్ అధికారికంగా నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే టెక్సాస్ లోని ఒక ముస్లిం ప్రార్థనాలయానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టటం గమనార్హం.

టెక్సాస్ లోని విక్టోరియాలోని ఈ ప్రార్థనాలయానికి తెల్లవారుజామున నిప్పు పెట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఈ ప్రార్థనాలయంలో దొంగలు పడ్డారు. ఈ ఘటనను మరవక ముందే.. దీనికి నిప్పు పెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది.

మరోవైపు.. ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వచ్చే ముస్లింలపై నిషేధం విధించే ఫైలు మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం పెట్టిన వెంటనే.. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేసింది. షాకింగ్ విషయం ఏమిటంటే.. ట్రంప్ ఆదేశాలు జారీ  అయిన తర్వాత కైరో నుంచి న్యూయార్క్ బయలుదేరి విమానంలోకి ఎక్కకుండా ఐదుగురు ఇరాకీ ప్రయాణికుల్ని.. ఒక యెమన్ వాసిని అధికారులు అడ్డుకోవటం సంచలనంగా మారింది. వారి దగ్గర చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్నప్పటికీ వారిని అనుమతించేందుకు అధికారులు నో చెప్పేశారు. మరికొన్ని విమానయాన సంస్థలు.. అమెరికాకు వెళ్లాలనుకున్నఇరానీయులకు టికెట్లు అమ్మటం లేదు. కాగా.. ట్రంప్ విధించిన నిషేధం గ్రీన్ కార్డు ఉన్న వారికి కూడా వర్తిస్తుందన్న మాట ఇప్పుడు పెను కలకలాన్ని సృష్టిస్తోంది.

తన తాజా నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. ట్రంప్ రంగంలోకి దిగారు. తాను తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలిచేందకు వీలుగా ఆయన జపాన్.. జర్మనీ.. రష్యా అధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఓవైపు ముస్లింలను అడ్డుకునేలా నిర్ణయం తీసుకున్న ట్రంప్.. మరోవైపు పలువురు దేశాధినేతలతో ఫోన్ కాల్స్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News