కరోనా తర్వాత.. కొంప కొల్లేరు అయ్యేలా రూ.100 కోట్ల మహా బాంబ్

Update: 2021-03-21 04:35 GMT
ఓపక్క దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర సర్కారు కిందామీదా పడిపోతోంది. రోజుకు 40-50 వేల పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్న వేళ..ఈ మహమ్మారిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక కిందా మీదా పడుతున్న ఉద్దవ్ ఠాక్రే సర్కారు మీద మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా తాజా ఆరోపణ మారింది. ముంబయి మహానగరంలోని బార్లు.. రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లను వసూలు చేయాలని రాష్ట్ర హోంమంత్రే స్వయంగా తమకు టార్గెట్ విధించినట్లుగా మాజీ డీజీపీ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపటమే కాదు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.

 మొన్నటి వరకు మహా సర్కారులో డీజీపీగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పరమ్ బీర్ సింగ్. ఆయన్ను ఇటీవల హోంగార్డ్స్ విభాగానికి కమాండెంట్ జనరల్ గా బదిలీ చేశారు. అలాంటి ఆయన రాష్ట్ర హోం మంత్రిపై కీలక వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు పెను వివాదంగా మారింది. మహా హోంమంత్రి కారణంగానే ఇటీవల సస్పెండ్ అయిన అదనపు ఇన్ స్పెక్టర్ గా సచిన్ వాజేతో పాటు.. ఏసీపీ సంజయ్ పాటిల్ కు లంచాల వసూళ్ల టార్గెట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఈ వివాదం అంతకంతకూ ముదరటంతో ఆ ఇష్యూ మీద సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ముంబయి మహానగరంలో 1750 వరకు బార్లు.. రెస్టారెంట్లు ఉన్నాయని.. వాటి నుంచే కాదు.. ఇతర మార్గాల ద్వారా  నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని చెప్పటమే కాదు.. ఎవరి నుంచి ఎంత మొత్తం లాగాలన్న విషయం మీద వివరాలు చెప్పటం గమనార్హం. ఒక్కో బార్ అండ్ రెస్టారెంట్ నుంచి నెలకు రూ.2-3 లక్షల వరకు వసూలు చేసి పెట్టాలని హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెప్పినట్లుగా పరమ్ బీర్ సింగ్  ఆరోపించారు. అంతేకాదు.. ఆయన సీఎం ఉద్దవ్ ఠాక్రేకు 8 పేజీల లేఖ రాశారు. అందులోని విషయాలు బయటకు వచ్చి సంచలంగా మారాయి.

ఈ మొత్తం ఎపిసోడ్ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చుట్టూనే తిరిగింది. దీనిపై ఆయన  సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తనపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఇప్పటికే సచిన్ వాజే అరెస్టు అయ్యారని.. ఆ కారు యజమాని హిరేణ్ అనుమానాస్పద మరణించారు. ఈ అనుమానాస్పద మరణాల్లో వాజే హస్తంతో పాటు.. పరమ్ బీర్ సింగ్ సహకారంపైనా ఆరోపనలు ఉన్నాయి. అరెస్టు అవుతానన్న భయంతోనే పరమ్ భీర్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడుతున్నారు. హెంమంత్రి.. సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య మొదలైన ఈ రచ్చ ఎక్కడి వరకు సాగుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News