మళ్ళీ లాక్ డౌన్

Update: 2022-10-11 04:54 GMT
కరోనా వైరస్ కు పుట్టిల్లు అయిన చైనాలో మళ్ళీ లాక్ డౌన్ మొదలైపోయింది. చాలా నగరాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టేస్తోంది. చాలా నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించక తప్పలేదు. అక్టోబర్ 1 నుండి చైనాలో జాతీయ సెలవుదినాలు మొదలయ్యాయి. సెలవులకు ముందు రోజుకు 600 ఉన్న కేసుల సంఖ్య సెలవులు ఇచ్చిన తర్వాత నుండి రోజుకు 2 వేల దాకా నమోదవుతున్నాయి. కఠినచర్యలు తీసుకోకపోతే కేసుల సంఖ్య ఇంకా పెరిగిపోతుందన్న టెన్షన్ వల్లే చాలా నగరాల్లో లాక్ డౌన్ విధించేశారు.

కరోనా వైరస్ డ్రాగన్ దేశంలో పుట్టి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. రెండుమూడుసార్లు ప్రపంచదేశాలను చుట్టేయటం వల్ల చాలా దేశాలు అనేకరకాలుగా కుదేలైపోయాయి.

ఇపుడిప్పుడే చాలాదేశాలు వైరస్ సమస్య నుండి బయటపడుతున్నాయి. అయితే ఎన్నిదేశాలు బయటపడుతున్నా చైనా మాత్రం మళ్ళీ మళ్ళీ కేసులబారిన పడుతునే ఉంది. జీరో కేసులంటు డ్రాగన్ దేశంలో ఎన్ని కఠినమైన ఆంక్షలను విధిస్తున్నా కేసులైతే ఆగటంలేదు.

బీజింగ్, షాంఘై, ఝాంగ్జవ్, ప్యాంగ్యాంగ్ లాంటి అనేక ప్రముఖ నగరాలు చాలాకాలం లాక్ డౌన్లోనే ఉండిపోయాయి. ఇప్పటికీ విదేశాలకు వెళ్ళివచ్చినా, విదేశాలనుండి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఐదురోజులు సెల్ఫ్ క్వారటైన్లో ఉండాల్సింది.

ఈ పద్దతిలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఈమధ్య ఐదురోజులు క్వారంటైన్లో ఉండొచ్చారు. సమస్యున్న పట్టణాలు, నగరాల్లో మామూలు జనాలను అసలు రోడ్లపైకే రానీయటంలేదు. జనాలను ఇళ్ళల్లోనే ఉంచి ప్రభుత్వం తాళాలు వేసేస్తోంది.

ఇవి సరిపోదన్నట్లుగా రెగ్యులర్ పోలీసులతో పాటు మిలిటరీని కూడా నగరాల్లోకి దింపి కాపలా కాయిస్తోంది. ఇక్కడ ఆశ్చర్యం ఏమింటటే కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఎంతటి కఠిన నియమాలను పాటిస్తున్నా వేలాది కేసులు ప్రతిరోజు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఇన్నిన్ని వేలాది కేసులు ఎక్కడినుండి వస్తున్నాయి, ఎలా కంట్రోల్ చేయాలో అర్ధంకాక డ్రాగన్ తలలు పట్టుకుంటోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News