మళ్ళీ కాంగ్రెస్ టీడీపీ పొత్తు

Update: 2022-02-04 04:29 GMT
మళ్ళీ కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ పొత్తులు తెలుగు రాష్ట్రాల్లో కాదులేండి. తాజాగా పొడిచిన పొత్తు అండమాన్ నికోబార్ దీవుల్లో. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో తొందరలోనే మున్సిపల్, పంచాయితీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని ఉభయ పార్టీల నేతలు డిసైడ్ అయినట్లు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ మీడియాతో చెప్పారు.

 ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజాస్వామ్య యుత పాలన కోసమే తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పోర్టు బ్లెయిర్ మున్సిపాలిటీలోని 2, 5,15 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుందని యాదవ్ చెప్పారు. మార్చి 6వ తేదీన జరిగే పోలింగ్ 8వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. మిగిలిన వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు పోటీ చేస్తారని కూడా యాదవ్ తెలిపారు.

 తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తుల గురించి ఎలాంటి చర్చలు జరగకపోయినా అండమాన్ లో మాత్రం కలవటం ఆశ్చర్యంగానే ఉంది. ఆ మధ్య తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. పొత్తుల్లో పోటీ చేసిన రెండు పార్టీలు బాగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత నుంచి రెండు పార్టీల మధ్య బహిరంగంగా అయితే పొత్తులు లాంటి చర్యలు జరగలేదు.

 రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడ కాస్త సహకరించుకున్నా దాన్ని పొత్తనేందుకు లేదు. కాబట్టి రెండు పార్టీలు దేనికదే పోటీ చేసినట్లు అనుకోవాలి. మరి భవిష్యత్ సంగతి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే జనసేనతో పొత్తుకు చంద్రబాబు నాయుడు  ప్రయత్నిస్తున్నారు.

అది సాధ్యం కాకపోతే అప్పుడేమన్నా కాంగ్రెస్, వామపక్షాలతో కలిసే  అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఆ విషయంలో క్లారిటి రావవటానికి ఇంకా చాలాకాలముంది. ఏదేమైనా ఎక్కడో ఒకచోట రెండు పార్టీలు కలిసుండాలని డిసైడ్ అయినట్లే ఉంది. చూద్దాం దాని ప్రభావం ఎంతుంటుందో.  

Tags:    

Similar News