వర్క్ ఫ్రమ్ హోమ్ 3.O

Update: 2022-01-11 13:30 GMT
కరోనా మహమ్మారి పుణ్యమా అని కేవలం ఐటీ కంపెనీలకు పరిమితమైన వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికీ సుపరిచితం అయింది. ఈ పని విధానం గురించి గతంలో చాలా మందికి తెలిసింది. కరోనా కేసులు విపరీతంగా పెరగడం తో ఐటీ, మీడియా వంటి అన్ని రంగాల్లోనూ ఈ వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది మార్చిలో కరోనా విశ్వరూపం చూపించింది. కేసులు విపరీతంగా పెరిగాయి. ఈ సమయంలో చాలా కంపెనీలు ఇంటి నుంచి పని విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ తర్వాత జులైలో కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఆఫీసుకు వచ్చి ఉద్యోగులు పనిచేయాలనే నిబంధన తీసుకొచ్చారు.

ఉద్యోగులను ఆఫీసుకు పిలిపించాలని కంపెనీలు పలు ప్రయత్నాలు చేశాయి. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించాయి. ఇక హైబ్రిడ్ విధానంలో మెల్లమెల్లగా ఉద్యోగుల సంఖ్య పెంపు చేస్తూ పని చేస్తున్నాయి. అయితే గత నెల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన ఒమిక్రాన్ వేరియంట్ వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

దేశంలో మూడో వేవ్ ప్రారంభమైందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశాయి. ఫలితంగా కంపెనీలు మళ్లీ ఇంటి నుంచి పని విధానానికే సముఖత చూపుతున్నాయి. ఉద్యోగుల భద్రత దృష్ట్యా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాయి. కీలకమైన ఉద్యోగులనే కార్యాలయాలకు పిలిపిస్తున్నారు. ఇప్పటికే హైబ్రీడ్ పని విధానం అమలు చేస్తున్న ఢిల్లీ, ముంబై, కలకత్తా నగరాల్లోని కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ 3.Oను అమలు చేయడానికి సన్నద్ధమవుతున్నాయి.

ఐటీసీ ఇప్పటికే ఇంటి నుంచి పని విధానం కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అత్యవసరమైతేనే ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు సూచించింది. ఢిల్లీ, ముంబై, కలకత్తా నగరాల్లోని ఉద్యోగులు కీలకమైన వారే అత్యవసరమైతేనే కార్యాలయాలకు హాజరు కావాలని చెప్పింది. ఇక మిగతా నగరాలు, పట్టణాల్లో ఉద్యోగాలు 30 శాతం కుదించారు.

ఆ ముప్పై శాతం మంది కార్యాలయానికి రానవసరం లేదని... వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించింది. ఇక ఆధానీ గ్రూప్ లో ఉద్యోగులను యాభై శాతం మందికి ఇంటి నుంచి పని విధానం వెసులుబాటు కల్పించినట్లు ప్రకటించారు. కరోనా కేసుల దృష్ట్యా పూర్తిస్థాయిలో సన్నద్దమై ఉన్నామని చెప్పారు. తమ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం అమల్లోకి తెచ్చామని స్పష్టం చేశారు.

హైబ్రిడ్ పని విధానాన్ని కొనసాగిస్తున్న గోద్రెజ్ కంపెనీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతవారమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అంతేగాకుండా సేల్స్ విభాగంలోని వందశాతం సిబ్బందికి ఇంటి నుంచి పని సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. చెన్నై కేంద్రంగా పని చేసే శ్రీరామ్ గ్రూప్ కూడా 75 శాతం ఉద్యోగులతో నడిపిస్తున్నారు. ఇక నుంచి దానిని యాభై శాతానికి కుదిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.

ప్రాంతాన్ని బట్టి ప్రత్యేక నిబంధనలు విధిస్తున్నామని చెప్పారు. ఎక్కువ కేసులు ఉన్న దగ్గర తక్కువమంది, తక్కువ కేసులు ఉన్న దగ్గర కాస్త ఎక్కువ మంది కార్యాలయాలకు వస్తున్నారని పేర్కొన్నారు. ఇక రిలయన్స్, మహీంద్రా, టాటా గ్రూపు, ఆదిత్యా బిర్లా వంటి కంపెనీలు కూడా ఇంటి నుంచి పనికే మొగ్గు చూపుతున్నాయి. ఆఫీసుకు చాలా తక్కువ మంది వస్తున్నారని ఆ కంపెనీలు ప్రకటించాయి.

కొన్ని కంపెనీలు ఏకంగా టీకా క్యాంపులను కూడా ఏర్పాటు చేశాయి. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా అన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగుల భద్రతను చూసుకుంటూ... రకరకాల వెసులుబాట్లు అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.


Tags:    

Similar News