అద్వానీకి ఒక రూలు - యడ్యూరప్పకు ఇంకో రూలా!

Update: 2019-07-27 05:04 GMT
భారతీయ జనతా పార్టీ రాజకీయ విలువలను ప్రవచిస్తూ ఉంటుంది. అయితే అవసరం కోసం తను ప్రతిపాదించిన విలువలను తనే ఉల్లంఘిస్తూ ఉంది. వరసగా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ తను పాటించినవే విలువలు అని అంటోంది. అవసరానికి అనుగుణంగా అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తోంది.

కమలం పార్టీ రాజ్యాంగ నిబంధనలకే నీళ్లు వదలుతోందని పలువురు వాపోతున్నారు. తమకు అవసరమైన చోట బీజేపీ విలీన రాజకీయాలతో రాజ్యాంగ విలువలను మంటగలుపుతోందనే విమర్శలు రానే వస్తున్నాయి.

ఆ సంగతలా ఉంటే.. భారతీయ జనతా పార్టీ వాళ్లు తామే పెట్టుకున్న రూల్స్ ను పలు సార్లు పాటిస్తున్నారు - పలు సార్లు ఉల్లంఘిస్తున్నారు. అందులో డెబ్బై ఐదేళ్ల నిబంధన ఒకటి.

ఈ రూల్ ను అనేక మంది సీనియర్ల విషయంలో ఒత్తిడి చేసి మరీ పాటింపజేశారు మోడీ - అమిత్ షా. వారికి డెబ్బై ఐదేళ్ల వయసు దాటిందని అంటూ కీలకమైన పదవుల నుంచి తప్పించారు.

కొందరికి అయితే కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని పదవుల నుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. వయసు మీద పడిందనే నెపంతో మోడీ - షాలు పక్కన పెట్టిన వారిలో ఎల్ కే అద్వానీ కూడా ఉన్నారు. బీజేపీకి పునాదులు వేసిన ఆ పెద్దమనిషిని మోడీ - షాలు వయసు అయిపోయిందంటూ పక్కన పెట్టారు. ఆయన కోరుకున్న వాటిని ఇవ్వలేదు. ఆఖరికి అగౌరవించారనే పేరు కూడా వచ్చింది. మరి అద్వానీ విషయంలో రూల్స్ అంటూ మాట్లాడిన మోడీ - షాలు ఇప్పుడు కర్ణాటకలో మాత్రం ఆ రూల్స్ పాటించకపోవడం  విశేషం.

డెబ్బై ఐడేళ్ల యడ్యూరప్పను అక్కడ సీఎంగా చేశారు.ఇటీవలి ఎన్నికల్లో ఆ వయసుకు దగ్గరైన  సీనియర్లకు టికెట్లే ఇవ్వలేదు. అలాంటిది తమ అవసరార్థం యడ్యూరప్ప విషయంలో మాత్రం మోడీ - షాలు తాము పెట్టిన నియమాలను తామే పాటించకుండా..తమ తీరేమిటో తెలియజేశారని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News