ఆ గ్రామంలోకి నిషేధం..గ్రామస్థుల కఠిన నిర్ణయం

Update: 2018-11-22 08:09 GMT
ఆచారాలు - సంప్రదాయాలు గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్లేగు - కలరా వ్యాధులు సోకినప్పుడు గ్రామస్థులంతా గ్రామ దేవతలను - బొడ్రాయిలను ప్రతిష్టించి ఒక రోజు పాటు గ్రామం నుంచి ఎవరు వెళ్లకుండా.. బయట నుంచి బయటకు రాకుండా దిగ్బంధనం విధించేవారు. ఇది తరాలుగా వచ్చిన సంప్రదాయం.. ఇప్పటికే గ్రామ దేవతలను ప్రతిష్టిస్తే ఇలాంటి నియమాలే పెడతారు. కానీ రాత్రి పూట కొన్ని గంటలు మాత్రమే ఊరును దిగ్బంధిస్తారు.

తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలోని చెక్కాపురం గ్రామస్థులు.. తమ గ్రామంలోకి ఎవరూ రావద్దని ‘ఇతరులు లోనికి రాకూడదు’ అని బోర్డు పెట్టారు. ఈ బోర్డును గ్రామంలోకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా పెట్టేసి దారి మూసేశారు. ఊళ్లోకి రాకుండా నిషేధం విధించడానికి ఈ గిరిజన గ్రామస్థులు చెబుతున్న కారణం తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు.

చెక్కాపురం గిరిజన గ్రామం. ఇక్కడ సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు. ఈ గ్రామంలో ఈ నెల 19 నుంచి 24 వరకు ‘గజం కంది పండుగ’ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగ సమయంలో ఊరి నుంచి ఎవ్వరూ బయటకు పోవడానికి వీల్లేదు.. రావడానికి వీల్లేదు.. అందుకే గ్రామస్థులు ఈ బోర్డును పెట్టారట..  పండుగ జరిగే ఈ ఐదు రోజులూ తమ గ్రామంలోకి ఇతరులు రాకుండా ఇలా నియమం పెట్టుకున్నారట.. ఎవరైనా అత్యవసరంగా వచ్చినా పండుగ పూర్తయ్యే వరకు తిరిగి వెళ్లరాదని చెబుతున్నారు.

అంతేకాదు ఈ నియమం ఉల్లఘించకుండా గ్రామస్థులంతా చుట్టూ బ్యానర్లు - పోస్టర్లు సైతం ఏర్పాటు చేసి గ్రామస్థులంతా పొలిమేరల్లో కాపాలాగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈ గ్రామం పెట్టిన బోర్డు కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఆసక్తి రేపుతోంది.
   

Tags:    

Similar News