దేశంలో అగ్నిప‌థ్‌.. 'బుగ్గి'.. చోద్యం చూస్తున్న కేంద్రం!

Update: 2022-06-18 08:30 GMT
కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు తీసుకువచ్చిన అగ్నిపథ్ సైనిక నియామ‌క విధానాన్ని నిరసిస్తూ యువత చేస్తున్న ఆందోళనలు మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. మొత్తం 7 రాష్ట్రాలు ఈ నిరసనలతో హోరెత్తాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడ్డారు. రైళ్లు, బస్సులకు నిప్పంటించి భయానక వాతావరణం సృష్టించారు. బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రహదారులు, రైల్వే ట్రాక్‌లపైకి చేరి నిరసన చేపట్టారు. లకీసరాయ్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ-భాగల్‌పుర్‌ విక్రమశిల ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 12 బోగీలు దగ్ధమయ్యాయి.

పెద్ద ఎత్తున పొగలు కమ్ముకుని ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికాగా.. అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రయాణికుడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సమస్తీపూర్‌ రైల్వేస్టేషన్‌లలో ఆందోళనకా రులు   సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పటించగా.. 8 బోగీలు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. పట్నాలోని ధనాపుర్ రైల్వేస్టేషన్ లో ఓ రైలుకు నిరసనకారులు నిప్పు పెట్టారు. పలువాహనాలు ధ్వంసం చేశారు. మెహియుద్దీనగర్ స్టేషన్ లో జమ్మూ తావీ ఎక్స్ ప్రెస్ రైళ్లోని రెండు బోగీలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

బెగుసరాయ్, బెత్తియా ప్రాంతాల్లోనూ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్రలతో రైల్వేస్టేషన్ లలోకి ప్రవేశించిన ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ససారామ్ లోని ఓ టోల్ ప్లాజాకు నిప్పటించారు.  బిహార్ డిప్యూటీ సీఎం రేణూదేవీ నివాసంపై ఆందోళనకారులు దాడిచేశారు. బెత్తియాలోని తమ నివాసంపై దాడి జరిగిందని, ఇల్లు దెబ్బతిన్నట్టు రేణూదేవీ కుమారుడు తెలిపారు. లకీసరాయ్ లోని భాజపా కార్యాలయానికి కొంతమంది ఆందోళనకారులు.. నిప్పుపెట్టారు. బీజేపీ బిహార్ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ నివాసంపై దాడి చేశారు.

ఆందోళనలతో బిహార్ లో రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌ బలియా జిల్లాలో ఓ రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. రైలుబోగీలకు నిప్పుపెట్టారు. పోలీసులు, సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అలీగఢ్‌లో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పెద్దఎత్తున ఆందోళనకారులు బైఠాయించగా.. ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా.. నిరసనకారులు పోలీస్‌ వాహనంపై దాడి చేశారు.

అలీఘడ్‌లోని.. ఓ పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు.. అక్కడున్న వాహనాన్ని తగలబెట్టారు. హరియాణాలో నిరసనకారులు రహదారులను నిర్బంధించగా పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారగా.. 144 సెక్షన్‌ విధించారు. డిల్లీలో ఛాత్ర -యువ సంఘర్ష్‌ సమితి నేతృత్వంలో విద్యార్థులు ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వసం సృష్టించారు. రైలు, పార్కింగ్లోని వాహనాలకు నిప్పంటించారు. రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ నిరసనకారుడు ప్రాణాలు కోల్పోయాడు.

కొస‌మెరుపు!

దేశ‌వ్యాప్తంగా అగ్నిప‌థ్ ప్ర‌క‌ట‌న అగ్గి రాజేసినా.. కేంద్రం నిమిత్తమాత్రంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. క‌నీసం ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్ర‌జాస్వామ్య వాదులు ఆరోపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఒక ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోగా.. అగ్నిప‌థ్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్ర‌క‌ట‌న మ‌రింత‌గా యువ‌త‌ను రెచ్చ‌గోట్టేలా ఉంద‌ని చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఆయా రాష్ట్రాల్లో మృతి చెందిన వారికి ప‌రిహారం ఇచ్చే బాధ్య‌త‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు కేంద్రంపై నెట్టేశాయి. దీంతో మృతుల కుటుంబీకులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయారు.
Tags:    

Similar News