ఢిల్లీలో ఆందోళ‌న తెలిపిన ఏపీ బాధితులు

Update: 2017-02-07 11:43 GMT

దేశ‌వ్యాప్తంగా  లక్షలాది మందిని ఆర్దికంగా ముంచేసిన‌ అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వ‌ద్ద‌ ధర్నా చేశారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని దాదాపు 40 లక్షల మంది బాధితులకు సొమ్మును చెల్లించాలని అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం మోసపూరిత చర్యలువల్ల ఇప్పటివరకు 150 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని బాధితులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం తెలిపింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్ముడుపోయేలా రాష్ట్రం ప్ర‌భుత్వం చొర‌వ తీసుకోవాల‌ని  బాధితుల సంఘం నాయకులు కోరారు. రాష్ట్రప్ర‌భుత్వం జాప్యం చేయ‌డం వ‌ల్లే త‌మ‌కు తిప్ప‌లు ఎదుర‌వుతున్నాయ‌ని వాపోయారు.

కాగా, గ‌త ఏడాది అగ్రీగోల్డ్‌కు విజయవాడలో 90 కోట్ల విలువైన 13ఆస్తులు, హైద‌రాబాద్ స‌మీపంలోని కీసరలో 200కోట్ల విలు వైన 341ఎకరాల భూముల్ని హైకోర్టు ఆదేశాల మేరకు మొదటి దశలో విక్రయాలు జరిపారు. అయితే ఈ ఆస్తుల‌ విష‌యంలో ఏపీలోని రాజధాని ప్రాంతానికి చెందిన ఓ కీల‌క మంత్రి పేరు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కేబినెట్ స‌మావేశం సాక్షిగా స‌ద‌రు మంత్రిని బాబు హెచ్చ‌రించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. "అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయ ప్రక్రియ ఇప్పటికే అనేక వివాదాలకు దారితీసింది. లక్షలాదిమందిని అగ్రిగోల్డ్‌ ఆర్దికంగా ముంచేసింనందున ఇప్పుడీ ఆస్తులపై ప్రతిఒక్కరి కన్నుంది. దీని జోలి కెళ్ళడం ద్వారా ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ట మసక బారుతుంది" అంటూ చంద్రబాబు క్లాస్ తీసుకున్నార‌ని మీడియాలో ప్రచారం జ‌రిగింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల క్షేత్రస్థాయి విలువను తగ్గించి తక్కువ ధరకే వేలంలో పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు కూడా తన దృష్టికొచ్చిందని, ఇలాంటి ఆటల్ని సాగనిచ్చేదిలేదంటూ చంద్ర‌బాబు హెచ్చరించార‌ని ఆ స‌మ‌యంలో ప‌లువురు పేర్కొన్నారు. వీలైనంత అధిక మొత్తాన్ని రాబట్టి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని చంద్ర‌బాబు ఆ స‌మ‌యంలో హామీ ఇచ్చారు. అయితే సుమారు ఆరునెల‌లు దాటిన‌ప్ప‌టికీ, కోర్టు తీర్పులు ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని పేర్కొంటూ బాధితులు ఢిల్లీలో ఆందోళ‌న నిర్వ‌హించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News