రైతులపై కేంద్రానికి ఉన్న ప్రేమ ఇంతేనా ?

Update: 2020-10-14 16:30 GMT
కేంద్రప్రభత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో తాజాగా బయటపడింది. కేంద్రం ఈమధ్యఅమల్లోకి తెచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలాగున్నా పంజాబ్ లో మాత్రం రైతుసంఘాలన్నీ ఏకమైపోయాయి. పార్టీలకు అతీతంగా రైతు సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

ఈ నేపధ్యంలోనే రైతులతో సమావేశమై కేంద్రప్రభుత్వ వైఖరిని వివరించేందుకు చర్చలకు ఆహ్వానించింది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ. కేంద్రప్రభుత్వం ఆహ్వానంలో భాగంగా పంజాబ్ లోని 30 రైతుల సంఘాల ప్రతినిధులు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా ఢిల్లీలోని వ్యవసాయమంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఎంతసేపటికి సమావేశం మొదలుకాకపోవటంతో రైతుల్లో అసహనం పెరిగిపోయింది.

సమావేశం నుండి వెళిపోదామని రైతులు అనుకుంటున్న సమయంలోనే శాఖ కార్యదర్శి సమావేశం హాలులోకి వచ్చారు. వచ్చీ రావటంతోనే రైతులతో మాట్లాడేందుకు రెడీ అయిపోయారు. దాంతో ఒళ్ళుమండిన రైతులు అసలు మంత్రి ఎక్కడున్నారంటూ నిలదీశారు. తమను సమావేశానికి రమ్మంటు ఆహ్వానించిన వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్ ఎక్కడున్నారంటూ కార్యదర్శిని సూటిగా ప్రశ్నించారు.

దాంతో ఏమి చెప్పాలో దిక్కుతోచని కార్యదర్శి మంత్రి సమావేశానికి రావటం లేదంటు చల్లగా చెప్పారు. దాంతో రైతులకు ఒళ్ళుమండిపోయింది. సమావేశానికి రమ్మని ప్రత్యేకంగా పిలిపించుకుని అవమానిస్తారా ? అంటూ కార్యదర్శిపై దాదాపు దాడి చేసినంత పనిచేశారు. రైతులు ఎంత గోల చేసినా మంత్రి మాత్రం వచ్చే సూచనలు కనిపించకపోవటంతో చేసేది లేక ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొత్తగా ఆమోదించిన వ్యవసాయ సంస్కరణల చట్టాన్ని రద్దు చేసేంతవరకు తమ ఆందోళనను విరమించే సమస్యే లేదంటూ రైతులు తెగేసి చెప్పారు. మొత్తానికి తాజా చర్యతో రైతాంగ సమస్యల పరిష్కారానికి కేంద్రానికి ఎంత శ్రద్ధుందో తెలిసిపోతోంది.
Tags:    

Similar News